నల్లరేగడి భూమిలో సోయా చిక్కుడు పంట వేసుకోవచ్చా.

సోయాచిక్కుడును మురుగు నీరు పోయే వసతి గల అన్ని రకాలైన భూముల్లోను పండించవచ్చును. వేసవి పంటగా ఫిబ్రవరి మాసములో, ఖరీఫ్ పంటగా జూన్-జులై మాసాల్లో, నీటి వసతి గల మెట్ట భూముల్లో ఆగస్టు మొదటి వారం వరకు, రబీలో అక్టోబరు మాసములో విత్తుకోవచ్చు. జెయస్-335, హార్టీ, యమ్ఎసియస్-201. యల్ఎస్బి-1 వంటి రకాలు అన్ని కాలాలకు అనుకూలంగా వుంటాయి.

సోయా చిక్కుడును అంతర పంటగా సాగు చేసుకోవచ్చా.

సోయాచిక్కుడును ప్రత్తిలో అంతరపంటగా 2:1 వరుసల నిష్పత్తిలో సాగు చేసుకోవచ్చును. యల్ఎస్బి-1, ఎమ్ఎసిఎస్-201 రకాలు అంతర పంటకు అనుకూలంగా వుంటాయి.

సోయా చిక్కుడుకు రైజోబియం కల్చరును ఉపయోగించవలసిన అవసరం వుందా?

సోయా చిక్కుడును మొదటి సారిగా విత్తుకొనే టప్పడు రైజోబియం జపానికమ్ కల్చరును ప్రతి 30 కిలోల విత్తనానికి 200 గ్రా, చొప్పన పట్టించుకోవాలి.

సోయాచిక్కుడులో కలుపు నివారణకు ఏ రసాయనాలు ఉపయోగించాలి.

సోయాచిక్కుడులో కలుపు నివారణ కొరకు, విత్తడానికి ముందు బసాలిన్ను ఎకరాకు 800 మి.లీ. చొప్పన 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఆక్సి ఫ్లోరోఫిన్ (గోల్) మందును ఎకరాకు 250 మి.లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే ఒకటి రెండు రోజుల్లో నేల తేమగా వున్నప్పడు పిచికారీ చేసుకోవాలి. తరువాత 30-35 రోజులలోపు అంతర కృషి ద్వారా కలుపును అదుపులో ఉంచుకోవాలి.

సోయాచిక్కుడులో ఆకులపై ఎర్రమచ్చలు, ఊదారంగు మచ్చలు వచ్చి ఆకులు మాడి రాలిపోతున్నాయి. ఏం చేయాలి.

సెర్మోస్పోరా ఆకుమాడు తెగులు ప్రధానంగా పైరు గింజ పట్టే దశలో ఆశిస్తుంది. ఆశించిన ఆకుల ఇరువైపుల ఎరుపు, ఊదారంగు కోణాకారపు మచ్చలేర్పడి క్రమేపి పసుపుగా మారతాయి. ఆకుల తొడిమెలు, కాండం, కాయలపై కూడా ఈ మచ్చలు గమనించవచ్చు. క్రమేపి ఆకులు మాడి రాలిపోతాయి.

అదే ఆల్టర్ నేరియా ఆకుమచ్చ తెగులయితే పంట చివరి దశలో గాయాలేర్పడిన ముదురు ఆకులపై గోధుమ రంగు గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. కొన్ని సార్లు కాయలపై కూడా ఈ తెగులు లక్షణాలు కనిపిస్తాయి.

నివారణకు, మాంకోజెబ్ 3 గ్రా. లేదా కార్భండాజిమ్ 1 గ్రా. లీటరు నీటిలో కలిపి 2-3 సార్లు వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.

సోయాచిక్కుడులో ఆకులపై రంధ్రాలున్నాయి. లేదా చిత్త పురుగును ఎలా నివారించుకోవాలి.

నివారణకు డైమిధోయేట్ 2 మి.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

సోయాచిక్కుడులో ఆకుమడత నివారణ ఎలా.

నివారణకు ఎసిఫేట్ 1 గ్రా. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా క్వినాల్ఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఆకులపై పసుపు లేదా గోధుమ మచ్చల వచ్చి ఆకులు మాడి పోతున్నాయి. ఏం చేయాలి.

బాక్టీరియా ఆకు మాడు ఆశిస్తే ఈ విధంగా లేత ఆకులపై పసుపు లేదా గోధుమ రంగు మెరిసే నీటి మచ్చలు ఏర్పడతాయి. మచ్చల మధ్య భాగం ఎండి ఎరుపు ఇటుక లేదా నలుపు రంగుకి మారి చుటూ పసుపు, ఆకుపచ్చ రంగులతో మిళితమైన వలయాలు ఏర్పడతాయి. బలమైన గాలులతో కూడిన వరాలు కురిసినప్పడు ముదురు మచ్చల మధ్య భాగం విరిగి పోవడం లేదా ఎండి పోవడం జరుగుతుంది. కాండం, ఆకు తొడిమలపై నల్లని పెద్దమచ్చలు ఏర్పడతాయి.

నివారణకు, ఈ తెగులు ఆశించే ప్రాంతాల్లో తట్టుకొనే రకాలైన ఎల్ఎస్బి-1, యంఎసియస్-58, పికె-472 సాగు చేయాలి. పది లీటర్ల నీటికి 15 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ + 1.5 గ్రా. ప్లాంటో మైసిన్ కలిపి 2-3 దఫాలుగా 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.

సోయాచిక్కుడులో కాండం తొలిచే ఈగను ఎలా నివారించాలి.

ఎకరాకి 5 కిలోల ఫోరేట్ 10 జి. గుళికలను వేసి లేదా ఎసిపేట్ 1.5 గ్రా. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి గానీ నివారించాలి.

ఆధారం: AP AGRISNET