అశ్వగంధ సాగు వివరములు (విధానియ సోమ్నిఫెరా) సాధారణ నామము : అశ్వగంధ శాస్త్రియ నామము : విధానియ సోమ్నిఫెర కుటుంబము : సోలనేసి ప్రాంతీయ నామము : అశ్వగంధ/పెన్నేరుగడ్డల వాణిజ్య నామము : అశ్వగంధ ఉపయోగపడు భాగములు : వేర్లు పరిచయము విథానియ సోమ్నిఫెరా అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ మొక్క సోలనేసీ కుటుంబానికి చెందినది. అశ్వగంధ లేదా పెన్నేరు గడ్డలుగా పిలువబడే ఈ మొక్క నిటారుగా పెరిగే శాఖాయుతమైన గుల్మము, ఒక మీటరు ఎత్తు వరకు పెరుగుతుంది. పత్రాలు పందినప్పుడు పసుపు రంగుకు మారతాయి. విత్తనాలు చిన్నగా లేతపసుపు రంగులో ఉంటాయి. వేర్లు సుమారు 10 నుండి 17.5 సెం.మీ. పొడవు మరియు 0.5-1.5 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటాయి. వేర్లు లేత పసుపుతో కూడిన తెలుపు రంగు ఉండి చిరు చేదును కలిగి ఉంటాయి. వ్యాప్తి దీనిని తెలంగాణ, ఆంధ్ర, రాజస్థాన్ , పంజాబ్ , కర్నాటక మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విరివిగా సాగు చేస్తున్నారు. నీమచ్ మరియు మాండ్ సర్ మార్కెట్లు అశ్వగంధ ఎగుమతికి ప్రసిద్ధిగాంచాయి. అశ్వగంధ కొనుగోలుదారులు, దిగుమతిదారులు , ప్రొసెసింగ్ చేసేవారు, ఆయుర్వేద ఔషధాలు తయారు చేసేవారు, అశ్వగంధ కొనుగోలుకు ఈ మార్కెట్ లను ఎంచుకుంటారు. మన రాష్ట్రంలో మహబూబ్ నగర్, మెదక్ , నల్గొండ , ఖమ్మం , రంగారెడ్డి జిల్లాలలో సాగుచేస్తున్నారు. నేలలు ఇసుక గరప నేలలు లేదా తేలికపాటి ఎర్ర నేలలు అనుకూలం. ఈ నేలల్లో సాగు చేసినపుడు వర్షాభావ పరిస్థితులలో తడులు అందించవలెను. ఇసుకతో కూడిన నల్ల నేలలలో కర్నూల్ మరియు అనంతపురము జిల్లాలలో గత కొన్ని సంవత్సరాలుగా వర్షాధారంగా, విజయవంతముగా 10,000 ఎకరాలకు పైగా సాగు చేయ బదుచున్నది. నీరు నిలువ ఉండే నేలలు ఆశ్వగంధ సేద్యానికి పనికిరావు. వాతావరణం సగటున కనీసం 600 – 700 మి.మీ. వర్షపాతం అవసరం. దీని సాగుకు 28 నుండి 38 ఉష్ణోగ్రత అవసరం. దీనిని సముద్ర మట్టానికి 1500 మీటర్లు ఎత్తు వరకు సాగు చేయవచ్చును. పొడి వాతావరణము సాగుకు అనుకూలం. పంట చివరి దశలో ఒకటి – రెండు వర్షాలు పడినట్టయితే అధిక దిగుబడులు పొందవచ్చును. రకాలు ఆశ్వగంధలో మధ్యప్రదేశ్ లోని జవహర కృషి విధ్యాలయం వారి జవహర్ – 20 రకము, CIMAP లక్నో వారి రక్షిత, పోషిత రకాలు మరియు నాగోరి అనే ప్రాంతీయ రకములు కూడా సాగులో ఉన్నవి. పంటకాలము జూలై రెండవ వారము నుండి ఆగష్టు రెండవ వారం వరకు విత్తుకోవచ్చు. పంటకాలము 150 రోజులు (జవహర్ రకానికి పంటకాలం 180 రోజులు) విత్తన మోతాదు ఎకరాకు 7 – 8 కిలోలు కనీసం 5 రెట్లు ఇసుకతో కలిపి వేదజల్లినట్లయితే విత్తనములు గుంపులుగా పడకుండా చూడవచ్చు. విత్తనాలు మాత్రమే చూసుకోవాలి, ఎక్కువ లోతులో పడినట్లయితే ఆ విత్తనము మొలకెత్తే అవకాశము తక్కువగా ఉంటుంది. విత్తే దూరం మొక్కకు మొక్కకు మధ్య 7 నుండి 10 సెం.మీ. వరసకు వరసకు మధ్య 25 నుండి 30 సెం.మీ. ఎక్కువ విస్తర్ణంలో సాగుచేసినప్పుడు విత్తనమును నేరుగా వేదజల్లుకుంటే లాభదాయకము. ఎరువులు ఎకరాకు 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు దుక్కిలో వేసుకోవాలి, అధిక దిగుబడికోసం 20 కిలోల భాస్వరము, 16 కిలోల పోటాష్ ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. అంతర కృషి మడుల్లో పంటకాలంలో కలుపు లేకుండా చూడాలి. ఈ పంటను వర్షాధారంగా పండించావచ్చును. సస్యరక్షణ సాధారణంగా అశ్వగంధ పంటకు వచ్చు తీవ్రమైన తెగుళ్లు ఏమీ లేవు. పంట సేకరణ విత్తన 150 నుండి 180 రోజులకు పంట తయారు అవుతుంది. వీటి కాయలు ఎరువు రంగులోనికి మారినప్పుడు గాని లేదా ఆకులు పూర్తిగా ఎండిపోయినప్పుడు గాని అశ్వగంధ వేర్లను సేకరించుకోవాలి. మొక్కను సమూలంగా పీకి వేరు కాండము విభజించాలి వేర్లను సేకరించుకోవాలి. వేర్లను 7 నుంచి 10 సెం.మీ. ముక్కలుగా చేసుకుని నీడన ఆరబెట్టుకోవాలి. అశ్వగంధ వేర్లు బాగా ఎండిన తర్వాత గ్రేడింగ్ చేసుకొని నిలువ చేసుకోవడం వలన రైతుకు అధిక ధర వస్తుంది. ఈ గ్రేడింగ్ ను నాలుగు రకాలుగా విభజించారు. ఏ గ్రేడు వేర్లు పలుచగా ఉండి లోపలి భాగము స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉండి పొడవు 7 సెం.మీ. పైగా ఉండి 1 నుండి 1.5 సెం.మీ. మందము కలిగి ఉండాలి. బి గ్రేడ్ వేర్లు పలుచగా ఉండి లోపలి భాగము తెలుపు రంగులో ఉండి పొడవు 5 సెం.మీ. పైగా ఉండి 1 సెం.మీ. మందము కలిగి ఉండాలి. సి గ్రేడ్ వేర్లు 3 నుండి 4 సెం.మీ. పొడవు ఉండి చిన్న శాఖలు కలిగి ఉండి లోపలి భాగము పసుపు రంగులో ఉంటాయి. తక్కువ గ్రేడు లేదా చివరి గ్రేడు వేర్లు చిన్న చిన్న ముక్కలుగా పలుచగా, సన్నగా ఉండి లోపలి భాగము పసుపు రంగులో ఉంటాయి. దిగుబడి ఆరబెట్టిన వేర్లు ఒక ఎకరాకు 200 నుండి 300 కిలోల వరకు దిగుబడి వస్తుంది. గమనిక నేల స్వభావం, వాతావరణ పరిస్తితులు, మార్కేట్ సరళి ఆర్థికాంశాలను ప్రభావితం చేస్తాయి. ఉపయోగములు పేర్లను నరాల బలహీనతను నివారించడానికి , వ్యాధి నిరోధక శక్తి పెంచుటలోను మరియు అల్సర్ల నివారణంలోను ఉపయోగిస్తారు. ఆశ్వగంధ వేరు చుర్ణాన్ని పంచదారతో కలిపి నేతితో తీసుకున్నట్లయితే నిద్రలేమి నుండి నివారణ పొందవచ్చును. ఆధారం:తెలంగాణ రాష్ట ఔషధ మొక్కల బోర్డు, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా, 6వ అంతస్థు, TSGLI బిల్డింగ్, తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాదు – 500 001. ఫోవ్: +21 40 66364096, 24764096 . website : ww.tsmpb.in E-mail: tsmapb@gmail.com