నల్ల బియ్యం పోషకతత్వం తో సంపన్న ఆహారం బ్లాక్ రైస్ లేదా ఊదా బియ్యం అని కూడా పిలుస్తారు. దీనిని పురాతన ధాన్యంగా పరిగణిస్తారు. కానీ నేడు ఇది ఒక శక్తివంతమైన ఎన్నో పోషకాలను కలిగి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెల్ల బియ్యంలా కాకుండా, బ్లాక్ రైస్ దాని బయటి ఊక పొరను నిలుపుకుంటుంది, ఇది ముదురు నలుపు లేదా ఊదా రంగును కలిగి ఉంటుంది. ఈ ప్రత్యేకమైన బియ్యం లో ఆంథోసైనిన్లు (యాంటీ ఆక్సిడెంట్లు) ఎక్కువగా ఉండటం వలన క్యాన్సర్ ను నిరోధించే లక్షణాలను కలిగి ఉండటం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి ఆరోగ్య ప్రయోజనాలకు నెలవుగా ఉన్నదనడంలో ఆశ్చర్యం లేదు. అంతే కాకుండా సూర్యరశ్మి, ఇతర హాని కలిగించే ప్రకాశవంత మైన వెలుగులు లేదా కాంతి కిరణాల నుంచి కళ్ళకు రక్షణగా లుటిన్, జియాక్సాంథిన్ వంటి కెరోటినాయిడ్లు ఈ బియ్యంలో ఉండటం వల్ల కంటి ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది కాలేయ పనితీరును ఎంతగానో మెరుగు పరుస్తుంది, కడుపులో మంటను తగ్గిస్తుంది, కంటి ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో ఎంతైనా తోడ్పడుతుంది. మరీ ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు బ్లాక్ రైస్ ప్రతి రోజూ ఆహారంగా తీసుకోవడం వల్ల దీనిలో ఉండే ప్రొటీన్లు, ఫైబర్ కారకాలు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేసి, త్వరగా ఆకలికాకుండా నిరోధిస్తుంది. నల్ల బియ్యంలో (100 గ్రా.) పోషకాలు పోషకం పేరు మోతాదు శక్తి 335 కిలో.క్యాలరీలు మాంసకృత్తులు 8.5 గ్రాములు పిండిపదార్థాలు 72 గ్రాములు తినే పీచు 4.9 గ్రాములు కొవ్వు 2.2 గ్రాములు ఇనుము 3.5 మిల్లీ.గ్రాములు మెగ్నీషియం 120 మిల్లీ.గ్రాములు ఆంథోసయనిన్లు అధికం బ్లాక్ రైస్ రకాలు ఇండియన్ బ్లాక్ రైస్ (చాఖావో): మణిపూర్ కు చెందినది, ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. చైనీస్ ఫర్బిడెన్ రైస్: జిగురుగా ఉండే చిన్న-ధాన్యపు రకం థాయ్ బ్లాక్ జాస్మిన్ రైస్: సుగంధ దీర్ఘ- ధాన్యం బియ్యం ఇండోనేషియా బ్లాక్ స్టిక్కీ రైస్: డిజర్టులు, పుడ్డింగ్‌లలో ఉపయోగిస్తారు నల్లబియ్యంతో కేక్ కావలసిన పదార్థాలు 1 కప్పు నల్ల బియ్యం పిండి కప్పు గోధుమ పిండి కప్పు చక్కెర 1 టేబల్ స్పూను వెనిగర్ 1/4 కప్పు నూనె లేదా వెన్న 2 గుడ్లు (లేదా ప్రత్యామ్నాం (ము 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్ 1/2 టీస్పూన్ వెనిలా ఎసెన్స్ 1/2 కప్పుపాలు తయారీ ఒక గిన్నెలో నల్ల బియ్యం పిండి, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, చక్కెర వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో గుడ్లు, నూనె/వెన్న, వెనిలా ఎసెన్స్, పాలు వేసి బాగా గిలకొట్టాలి. ఈ రెండు గిన్నెలలో ఉన్న మిశ్రమాన్ని అంతా ఒక గిన్నెలోకి చేర్చి ఉండలు లేకుండా మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఆ తరువాత కేక్ మౌల్డ్ కి నూనె రాసి, ఈ పిండి మిశ్రమాన్ని అందులో వేయాలి. బేకింగ్ కోసం ముందుగా 180 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడిచేసిన ఓవెన్లో సుమారు 25-30 నిమిషాలు కేక్ మౌల్డ్‌లో ఉన్న పిండి మిశ్రమాన్ని బేక్ చేసుకోవాలి. కేక్‌ను ఓవెన్ నుండి తీసి, పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసి వడ్డించవచ్చు. నల్ల బియ్యంతో వడియాలు కావలసిన పదార్ధాలు నల్ల బియ్యపు పిండి: 1 కప్పు నీళ్ళు: 3 కప్పులు తయారీ ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నల్ల బియ్యపు పిండిని కొద్దికొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండలు కట్టకుండా బాగా కలపాలి. ఇందులో పచ్చిమిర్చి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించి, పిండి చిక్కగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఈ పిండి మిశ్రమాన్ని ఆరబెట్టేందుకు ప్లాస్టిక్ షీట్లపై లేదా బట్టలపై చిన్న చిన్న వడియాలుగా పెట్టాలి. వీటిని ఎండలో పూర్తిగా ఆరబెట్టి, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ముఖ్య సూచన : వడియాలు బాగా ఎండాలి, లేకపోతే చెడిపోతాయి. నల్ల బియ్యం వర్మిసెల్లి ముందుగా నల్ల బియ్యాన్ని నానబెట్టి, రుబ్బి, పిండిలా చేసి, తరువాత దానిని సన్నని నూడుల్స్ ఆకారంలోకి మార్చి, ఆపై ఆవిరిపై ఉడికించి, ఆరబెడతారు. తయారీ ముందుగా నల్ల బియ్యం (కౌని బియ్యం) ఎంచుకోవాలి. ఇది బ్లాక్ గ్లూటినస్ బియ్యం రకానికి చెందినది. ఈ బియ్యాన్ని సుమారు 4-6 గంటలు లేదా రాత్రంతా నీటిలో నానబెట్టాలి. నానబెట్టిన బియ్యాన్ని నీటిని వడగట్టి, మెత్తని పిండిలా రుబ్బుకోవాలి. పిండి మరీ గట్టిగా లేదా మరీ పల్చగా ఉండకూడదు. తయారుచేసిన బియ్యం పిండిని వెర్మిసెల్లి (నూడుల్స్) ఆకారంలోకి మార్చడానికి వెర్మిసెల్లి మేకర్ (నూడుల్స్ మేకర్) ఉపయోగించాలి. ఆకృతిని ఇచ్చిన పిండిని మరుగుతున్న నీటిలో వేసి కొద్దిసేపు ఉడికించాలి. ఉడికించిన వెర్మిసెల్లిని నీటి నుంచి తీసి, చల్లబరచాలి. ఇప్పుడు, వెర్మిసెల్లిని ఆరబెట్టాలి.ఇది సాధారణంగా గాలిలో లేదా డ్రైయర్ లో జరుగుతుంది. ఇది వెర్మిసెల్లిని గట్టిగా ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేస్తుంది. ఆధారం : పాడిపంటలు మాస పత్రిక డా. రాచూరి.ప్రభావతి విషయ నిపుణులు(గృహ విజ్ఞాన శాస్త్రం), కె.వి.కె., గరికపాడు, ఎన్టీఆర్ జిల్లా