ఆరోగ్య రక్షణలో మన చుట్టూ ఉండే ఔషధ మొక్కలు - వాటి ఉపయోగాలు ప్రస్తుత ఆహార ఆరోగ్య అలవాట్లతో కూర్చుంటే వెన్ను నొప్పి, నడిస్తే కాళ్ళ నొప్పులు, కీ బోర్డుతో పని చేస్తే వేళ్ళు, మెడ నొప్పులు వంటివి వయస్సు తో సంబంధం లేకుండా వస్తున్నాయి. వీటికి తోడు కాస్త వయసు పైన పడితే మోకాళ్ళ చిప్పలు అరిగిపోవడం, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్స్, ఎముకలు బోలుగా మారిపోవడం, వంటివి పిలవక పోయినా వచ్చి పడుతున్నాయి. మందులు వాడినా, శస్త్ర చికిత్స చేయించుకున్నా ఫలితం లేకుండా ఉంది. అందుకే వాటితోపాటు కొన్ని రకాల ఔషధ మొక్కలను ఉపయోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మన చుట్టూ ప్రకృతి లో ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి. కొన్ని మొక్కల ఆకులు, పువ్వులు, కాయలను ఆయుర్వేద ఔషధాలలో విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలలో లభించే కొన్ని ఔషధ మొక్కలు, వాటి ఉపయోగాలను తెలుసుకుందాం. తిప్పతీగ హృదయాకారంలో ఆకులు ఉండి పసుపు పువ్వులతో ఎర్రని పండ్లతో ఉంటుంది. దీన్నే గిలోయి అంటారు. అంటే వృద్ధాప్యాన్ని నిరోధించే అమృతం అని అర్థం. ఈ మొక్క కాండంలో ఫైటో కెమికల్స్ ఇంఫ్లమేషన్‌ను అడ్డుకుని తద్వారా కీళ్ళ వాపుల్ని నివారిస్తుంది. ఎముక కణాల సంఖ్య పెంచగలదు. కాలేయం మూత్ర పిండాల వ్యాధులను తగ్గిస్తుంది. గోరువెచ్చని పాలలో పావు లేదా అర టీ స్పూను తిప్ప తీగ పొడి వేసుకుని తాగితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. కరూరవల్లి/వాము ఆకు వంగ రంగులో నక్షత్ర ఆకారంలో పూలు ఉండే ఈ ఔషధ మొక్క ఐరోపా దేశాల్లో పెరుగుతుంది. ఆకుల్ని తాజాగానూ ఎండు రూపంలో సూప్‌లు సలాడ్లలో వాడతారు. ఇది శరీరంలోకి వెళ్ళాక రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేసి కీళ్ళ దగ్గర మంటని కలిగించే హార్మోన్లను అడ్డుకుంటుంది. ఇందులో గామాలినోనిన్, లినోలేనిక్ అనే పాలీ అనాసౌచురేటెడ్ ఒమేగా-6 అనే ఫాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. కణ నిర్మాణానికి కణాల పనితీరుకి ఎంతో ఉపయోగ పడుతుంది. అశ్వగంధ వీటి వేళ్ళను భారతీయ సంప్రదాయ వైద్యం ఎముక వ్యాధుల చికిత్సలో వేల ఏళ్ళ నుంచి ఉపయోగిస్తుంది. ఈ సప్లిమెంట్లను పన్నెండు వారాల పాటు తీసుకోవడంవల్ల ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల వచ్చిన వాపులు నొప్పులు తగ్గుతాయి. ఎముకల్లో కాల్షియం శోషణ పెరిగేలా చేసి కీళ్ళ దగ్గర మృదులాస్థి కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఈ పొడిని గోరువెచ్చని నీళ్ళలో కలుపుకుని పరగడుపున తాగితే కీళ్ళ అరుగుదల నెమ్మదిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. మానసిక వ్యాధులకు ప్రయోజనకారి తుమ్మి ఇది పుదీనా కుటుంబానికి చెందిన ఒక దీనిని సుగంధ మొక్క వంటకాలలో కూడా వాడతారు. ఆకులు తినడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని వ్యర్ధాలను తొలగిస్తుంది. గాయాలు త్వరగా నయం కావడానికి ఆర్థరైటిస్ వంటి వాటికి మంచి మందుగా పని చేస్తుంది. జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలకు ఇది చక్కగా పని చేస్తుంది. ఆకులను నూరి నీటిలో మరిగించి ఆవిరి పీలిస్తే గొంతు నొప్పి, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది చర్మ వ్యాధులకు కూడా బాగా పని చేస్తుంది. తులసి ఈ మొక్కను మూలికల రాణిఅని అంటారు. తులసి ఆకుకు నీటిని శు భ్రపరిచే విశేషమైన గుణం ఉంది. తులసి ఉ న్న పరిసరాలలోని కాలుష్యాన్ని నివారిస్తుంది. దగ్గు, జలుబు, జీర్ణ సమస్యలు మరియు వత్తిడిని తగ్గిస్తుంది. జిల్లేడు దీనిని ఆర్కపత్రం అని పిలుస్తారు. జిల్లేడు మొక్కల వేర్లు, బెరడు నుంచి లభించే రసాయనాలు, దగ్గు, జలుబు, మలబద్దకం వంటి వాటికి విరుగుడుగా పని చేస్తుంది. జిల్లేడు ఆకులను సైంధవ లవణంలో కలిపి తీసుకుంటే జీర్ణకోశ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. జిల్లేడు పాలు పంటి నొప్పి నివారణలో అద్భుతమైన ఔషధంగా గుర్తింపు పొందింది. ఆయుర్వేద విధానంలో కుష్టు రోగం, పక్షవాతం తదితర రకాలా జబ్బులకు నివారణలో ఉపయోగిస్తారు. కలబంద చర్మం జుట్టు సంరక్షణకు ఉపయోగ పడుతుంది. కాలిన గాయాలు, దద్దుర్లు, చర్మ వ్యాధులకు ఉపశమనంగా వాడ తారు. మొటిమలు వాటి మచ్చలకు దివ్య ఔషధం. వేప ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంది. చర్మ వ్యాధుల, దంత సమస్యలు జీర్ణ సమస్యను నయం చేయడానికి ఉపయోగ పడుతుంది. ఉమ్మెత్త (దతూర) గ్రామీణ ప్రాంతాలలో దీనిని ఉమ్మెత్తగా పిలుస్తారు. ఇది వంగ జాతికి చెందిన మొక్క. దీని ఆకును కుక్క కాటుకు, ఎలుక కాటుకు వంటి నుండి సత్వర ఉపశమనం ఇచ్చే శక్తి ఉంటుంది. అయితే వీటిలో ఉండే ట్రోఫీన్ అనే రసాయనం వలన దీనిని అధికంగా ఉపయోగించరాదు. సిందువార దీనినే వావిలిఆకు అని కూడా పిలుస్తారు. వీటి ఆకులను తల నొప్పి తో బాధపడే వారు వాడితే నొప్పి నివారణగా పని చేస్తుంది. ఆకులను మెత్తగా రుబ్బి నుదుటి భాగంపై పట్టించినట్లయితే సైనస్ వంటి నాసికా సంబంధమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆధారం : పాడిపంటలు మాస పత్రిక వై. ఉమాజ్యోతి శాస్త్రవేత్త (గృహవిజ్ఞాన శాస్త్రం) ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం, లాం గుంటూరు