సేంద్రియ వ్యవసాయం సులభం మన నేలను మనమే సంరక్షించుకోవాలి. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి. ప్రకృతితో మమేకమవ్వాలి. ఒకే పంట కాకుండా బహుళ పంటలు సాగు చేయాలి. ఇదే భవిష్యత్తు వ్యవసాయ విధానం కావాలి. అదీ ఆచరణలో చేసి చూపిస్తున్నారు ఓ రైతు. పన్నెండు ఎకరాల్లో పామాయిల్, కొబ్బరి, కోకో, మిరియాలు పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం గంగన్నగూడెం గ్రామానికి చెందిన బోయపాటి వెంకటేశ్వరరావు అనే రైతు 45,000 లీటర్ల సామర్ధ్యం గల సిమెంటు కుండీ కట్టించి అందులో జీవామృతం తయారు చేసి, నిల్వ చేసి పంటలకు డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. ఆవు మూత్రం, ఆవు పేడ, శనగపిండి, బెల్లం లేదా అరటి పళ్ల గుజ్జు, నీళ్ళు, పుట్టమన్నుతో జీవామృతం తయారు చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో కుండీ నిర్మాణం, తయారీకి మొదట్లో కొంత ఎక్కువ పెట్టుబడి అయినా దీర్ఘకాలంలో కలిగే ప్రయోజనాలతో పోలిస్తే ఎక్కువేం కాదంటున్నారు. ప్రతి రైతు కనీసం రెండు వేల లీటర్లు, నాలుగు వేల లీటర్లతోనైనా తయారు చేసుకోవచ్చని రైతు చెబుతున్నారు. ఇలా తయారైన జీవామృతాన్ని గేట్ వాల్వ్ తిప్పితే మనకు ఎక్కడకు కావాలంటే అక్కడకు నీటితో పాటు సేంద్రియ ఎరువు సమానంగా వెళ్లిపోతుంది. 12 ఎకరాలకు సరిపడా ఒక నెల రోజులు జీవామృతం, మరో నెల రోజులు విప్పచెక్క, కొబ్బరి చెక్క కలిపి కుళ్లబెట్టి ఉంచుతామంటున్నారు. అంతేగాకుండా ఒక పెద్ద డ్రమ్ములో కొబ్బరినూనె 10 లీటర్లు, అర కేజీ ఎమల్స్ ఫైర్ నీళ్ళలో వేసి బాగా కలిపితే మజ్జిగ మాదిరిగా తయారవుతుంది. (సాధారణంగా నీళ్ళలో నూనె కలవదు కాబట్టి ఈ మిశ్రమం కలపాలి) దీన్ని వేసవి వచ్చేసరికి సిద్ధం చేసుకుంటే ఉష్ణోగ్రతలు ఎంత పెరిగినా మొక్కలు వాడిపోకుండా, ఆకులు ఎండిపోకుండా పచ్చగా కనిపిస్తాయని దిగుబడులు కూడా ఎక్కువగా వస్తాయని చెబుతున్నారు.రైతు వెంకటేశ్వర రావు. అలాగే అవసరమైనప్పుడు వర్మీ కంపోస్టు, పేడ తోలడం వల్ల పంటల పెరుగుదలలో ఎంతో మార్పు కనిపించిందని చెప్పారు. ఒక్కోసారి వేపపిండి కొని ట్రైకోడెర్మా విరిడితో కలిపి వేయడం వల్ల గ్లానోడెర్మా రాకుండా నిరోధించవచ్చన్నారు. అలాగే వర్మీ కంపోస్టు, సూడోమోనాస్ ఇస్తున్నామని చెబుతున్నారు. ఒక ట్రక్కు ఎరువు కొనాలంటే రూ.4500 అవుతుంది అది ఒకచోట దింపి వెళ్ళిపోతాడు. దాన్ని పొలమంతా వేయాలంటే కూలీల ఖర్చు రూ.800 అవుతుంది. అదీ పొలమంతా పూర్తిగా అందుతుందని చెప్పలేమన్నారు. అంతేకాకుండా సేంద్రియ ఎరువుల వల్ల ఎర్ర చీమలు, మిత్రపురుగులు చనిపోవని, ఇవి పొలినేషన్ కు బాగా ఉపకరిస్తాయని చెప్పారు. ఆవులు, వానపాములు ఉంటే సేంద్రియ వ్యవసాయాన్ని మించిన పద్ధతి మరొకటి లేదని, భావితరాలకు కూడా సారవం తమైన భూమిని, ఆరోగ్యకరమైన పంటలను అందించవచ్చని వెంకటేశ్వరరావు నిరూపిస్తున్నారు. ఆధారం: పాడిపంటలు