సహజ వ్యవసాయంతో విజయపథంలో లావణ్య రమణారెడ్డి నాగర్కర్నూల్ మహిళా రైతు నాగర్కర్నూల్ జిల్లా, తెల్కపల్లి మండలం, కర్వంగ గ్రామానికి చెందిన శ్రీమతి కె. లావణ్య రమణారెడ్డి సుమారు 25 ఏళ్లుగా వ్యవసాయంలో కొనసాగుతూ, సహజ-సేంద్రియ పద్ధతులతో ప్రత్యేక గుర్తింపు పొందిన మహిళా రైతుగా నిలిచారు. రసాయన ఆధారిత వ్యవసాయంలో అధిక ఖర్చులు, వరుస వైఫల్యాలను ఎదుర్కొన్న ఆమె 2002లో సహజ-సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు. అప్పటి నుంచి రసాయన ఎరువులు, పురుగుమందుల పై ఆధారపడకుండా స్థానిక వనరులతోనే సాగు నిర్వహిస్తూ తన క్షేత్రాన్ని ఆదర్శ వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దారు. 25 ఎకరాల్లో సమగ్ర వ్యవసాయం సుమారు 25 ఎకరాల్లో సమగ్ర వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తూ వరి, మిరప, పత్తి, కందులు, వేరుశనగ, చిరుధాన్యాలు, కూరగాయలు, పసుపు, క్రాసాండ్రా వంటి పంటలను సాగు చేస్తున్నారు. పంటల వైవిధ్యం, పంట మార్పిడి, అంతర పంటలతో సాగు ప్రమాదాలను తగ్గిస్తూ ఆదాయాన్ని స్థిరీకరించారు. ప్రస్తుతం 45 ఎకరాలు లీజుకు తీసుకుని మొత్తం 70 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం సాగిస్తున్నారు. వ్యవసాయంలో అవసరమైన అనేక ఇన్ పుట్ లను ఆమె స్వయంగా తయారు చేసుకుంటారు. బీజామృతం, జీవామృతం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపత్ర కషాయం, పంచగవ్య, వర్మీకంపోస్ట్, పశువుల ఎరువు తదితరాలను వినియోగిస్తూ నేల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశీ విత్తనాలే ఆమె బలం దేశీ విత్తనాల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న లావణ్య రమణారెడ్డి, తన క్షేత్రంలోనే విత్తనాలను కాపాడుకుంటూ రైతు స్వావలంబనకు ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా దేశీ వరి రకాల సాగుపై తన అనుభవాన్ని ఇతర రైతులతో పంచుకుంటున్నారు. చీడపీడల నియంత్రణలో కూడా సహజ పద్ధతులకే ప్రాధాన్యం. ఫెరోమోన్ ట్రాప్స్, ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, పక్షి స్థావరాలు, సాగు పద్ధతులు వంటి సమగ్ర సస్యరక్షణ విధానాలను అనుసరిస్తున్నారు. వ్యవసాయంతో ఆర్థిక విజయానికి బాట సహజ-సేంద్రియ వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థికంగా కూడా లాభపడవచ్చని ఆమె తన క్షేత్రం ద్వారా చూపించారు. ఆమె తెలిపిన వార్షిక లాభం సుమారు రూ.10 లక్షలు. సేంద్రియ మిరప ద్వారా సుమారు రూ.3 లక్షల ఆదాయం, వరి ద్వారా ఎకరానికి సుమారు రూ.25,000 నికర లాభం పొందినట్లు పేర్కొన్నారు. నాణ్యమైన ఉత్పత్తులకు ప్రత్యక్ష మార్కెటింగ్ ద్వారా వినియోగదారులను సంపాదించుకోవడం ఆమె విజయానికి మరో కీలక కారణం. కిసాన్ మేళాల్లో స్టాళ్లు ఏర్పాటు చేయడంతో పాటు, హైదరాబాద్లో సహజ వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి అవుట్ లెట్ లను నిర్వహించినట్లు పత్రంలో పేర్కొన్నారు. రైతులకు మార్గదర్శకురాలిగా తన విజయాన్ని తనకే పరిమితం చేయకుండా ఇతర రైతులకు పంచడం లావణ్య రమణారెడ్డి ప్రత్యేకత. ఆమె క్షేత్రాన్ని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది రైతులు సందర్శించి సహజ వ్యవసాయ పద్ధతులను పరిశీలిస్తున్నారు. క్షేత్ర ప్రదర్శనలు, శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొంటూ రిసోర్స్ పర్సన్ గా కూడా సేవలందిస్తున్నారు. ప్రారంభంలో తక్కువ దిగుబడులు, మార్కెట్ కొరత, పరిమిత ఆర్థిక వనరులు, సేంద్రియ ఇన్పుట్ల లభ్యత వంటి సవాళ్లు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగారు. అవార్డులతో గుర్తింపు ఆమె సేవలకు హల్దర్ ఆర్గానిక్ ఫార్మర్ అవార్డు - ఐ.సి.ఎ.ఆర్., కృషి రత్న అవార్డు-2016, బెస్ట్ ఫార్మర్ అవార్డు - 2015, దేవి అవార్డు-2016, బెస్ట్ ఉమెన్ ఆర్గానిక్ ఫార్మర్ అవార్డు-2016, స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు-2022 తదితర అనేక పురస్కారాలు లభించాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ మహిళా సహజ రైతుగా కూడా గుర్తింపు పొందారు. ఒక రైతు ఒక మార్గదర్శకం స్థానిక వనరులు తక్కువ ఖర్చు నేల ఆరోగ్యం పంటల వైవిధ్యం నాణ్యమైన ఉత్పత్తి ప్రత్యక్ష మార్కెటింగ్ స్థిరమైన ఆదాయం ఇదే లావణ్య రమణారెడ్డి వ్యవసాయ విజయ సూత్రం. రసాయన ఆధారిత వ్యవసాయంలో ఎదురైన సమస్యలను అధిగమించి, సహజ వ్యవసాయాన్ని ఆచరణలో చూపిస్తూ, తన అనుభవాన్ని తోటి రైతులతో పంచుకుంటున్న ఆమె ప్రయాణం నేటి మహిళా రైతులకు స్ఫూర్తిదాయకం. "నా పొలం - నా పాఠశాల; నా అనుభవం -రైతులకు మార్గదర్శకం" అనే భావనతో సాగుతున్న లావణ్య రమణారెడ్డి విజయగాథ, సహజ వ్యవసాయం ద్వారా స్థిరమైన వ్యవసాయానికి ఒక చక్కని ఉదాహరణ. ఆధారం: పాడి పంటలు