ప్రకృతి వ్యవసాయ రత్నం ఆయనో ప్రకృతి ప్రేమికుడు.. పర్యావరణ హితుడు.. తాను కష్టపడి పండించే పంట అందరికీ ఆరోగ్యం ఇచ్చేదిగా ఉండాలను కుంటాడు. ప్రకృతి వ్యవసాయ పద్ధతి ఆచరిస్తున్నారు. అందులో అద్భుతాలు చేస్తున్నారు. తనకు తానే ఓ ప్రయోగశీలిగా మారి భూసార పరిరక్షణ, సహజ వనరుల సద్వినియోగంలో విభిన్న పంటల సాగుతో సమీకృత వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామానికి చెందిన గద్దె వెంకటరత్నం (రత్నాజీ) గత ఆరేళ్లుగా వరి, అపరాలు, మామిడి, అరటి, కొబ్బరి, సపోటా, జామ, కూరగాయలు పండిస్తూ, ఆవులు, కోళ్ళు, చేపల పెంచుతున్నారు. ఒక ప్రణాళిక, పక్కా ఆచరణ ఉంటే పంట పంటకు కాసుల పంట పందించవచ్చని నిరూపిస్తున్నారు. 2006 లో రెండెకరాల్లో ప్రారంభించి అకుంఠిత దీక్షతో నేడు 30 ఎకరాలకు పైగా విస్తరించి తెలుగు రాష్ట్రాల్లోనే కాక జాతీయ స్థాయిలో పేరు గడించారు వెంకటరత్నం. మూడు ఎకరాల్లో జగిత్యాల వరి రకం సాగు చేశారు. మరో చోట 70 సెంట్లలో సాగు చేసిన వరి పొలం చుట్టూ 5 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతున కందకం తవ్వించారు. కందకం తవ్వగా వచ్చిన మట్టితో ఆరు అడుగుల మేర గట్టు పటిష్టం చేశారు. ఈ గట్టు మీద మూడు వరుసల్లో 700 అరటి పిలకలు నాటారు. వాటి పక్కన మామిడి, జామ, సపోటా, సీతాఫలం, ఉసిరి, కొబ్బరి, బత్తాయి, బొప్పాయి, నిమ్మ, పసుపు మొక్కలు వేశారు. మధ్యలో బెండ, వంగ, ఆనప, మిరప వంటి కూరగాయల సాగు ప్రారంభిం చారు. అంతేకాకుండా మునగ, జనుము, కంది, వాక్కాయ, బంతి వంటి రక్షణ పంటలు వేశారు. గట్టు మీద నడిచే దారి మినహా ఎక్కడా అంగుళం భూమి వదలకుండా ఔషధ మొక్కలు సహా 50 రకాల నాటారంటే ఆయన ఆసక్తిని, అనురక్తిని తెలుసుకోవచ్చు. అరటిలో సాధారణ రకాలతో పాటు చక్కెరకేళి, థౌజండ్ వాలా(అరటి గెల నేల మీదకు దిగపోయేంత పొడవు ఉంటుంది.) మామిడిలో తోతాపురి, సువర్ణ రేఖ కాకుండా నిత్య మామిడి (కాలంతో సంబంధం లేకుండా కాయలు కాసే రకం) అలాగే గ్రాఫ్టింగ్ ద్వారా ఒకే చెట్టుకు పది రకాల మామిడి కాయలు కాసేలా చేశారు. గట్టు మీద మొక్కల ఆకులన్నీ ఇక్కడే రాలిపోయి ఎప్పటి కప్పుడు జీవన ఎరువుగా మారుతుంది. కందకంలో బోరు నీరు నింపి అందులో నాలుగు రకాల చేపల పెంపకం చేపట్టారు. ఇవి ఏడాదిలో 8-9 నెలల పాటు ఆదాయం ఇస్తాయని రైతు పేర్కొ న్నారు. రెండు ఎకరాల్లో కుజీ పటాలి అనే వరి రకం వేశారు. ఇది సాధారణ వరి కన్నా తక్కువ కాలంలో దిగుబడి వస్తుందని రైతు వెంకట రత్నం చెబుతున్నారు. (ఎకరాకు 28 బస్తాలు వస్తాయని అంచనా). మరో రెండు ఎకరాల్లో స్వర్ణ, మరో మూడు ఎకరాల్లో తెలంగాణాలో ఆదరణ పొందిన జగిత్యాల రకం వరి సాగు చేస్తున్నారు. ఆవుల పెంపకంతో గోమూత్రాన్ని నేరుగా పొలంలోకి పంపు తున్నారు. ఆవుల పేడతో కంపోస్ట్ తయారు చేస్తున్నారు. వీటిని చేపల చెరువుకు కూడా వాడుతున్నారు. రైతు గద్దె వెంకటరత్నం చెప్పేది ఒకటే.. విభిన్న పంటలు పండించాలి. తోడుగా కొద్దిపాటి పాడి ఉండాలి. చిన్న కమతాలున్న రైతయినా పంట మార్పిడి పాటించాలని. ఇంటిల్లిపాదికి సరిపడా కూరగాయలు, పండ్లు పండించు కోవడంతో పాటు అమ్ముకొని నిరంతర ఆదాయం పొందవచ్చని సలహా ఇస్తున్నారు. సంకలనం: మేగజైన్ సెక్షన్