పత్తి తెలంగాణలో ముఖ్యమైన వాణిజ్య పంటల్లో ఒకటి. పత్తి పంటలో అధిక దిగుబడి సాధించడానికి మంచి విత్తనం, సరైన విత్తే సమయం, తగిన మొక్కల సాంద్రత, కలుపు, పురుగు-తెగుళ్ల నియంత్రణ ఎంత ముఖ్యమో, సమతుల్య పోషక యాజమాన్యం కూడా అంతే ముఖ్యమైనది. పత్తి పంటకు నత్రజని (ఎన్), భాస్వరం (పి), పొటాషియం (కె) వంటి ప్రధాన పోషకాలతో పాటు కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ వంటి ద్వితీయ పోషకాలు, జింక్, ఇనుము, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలు అవసరం. వీటిలో ఏదైనా ఒక పోషకం లోపించినా మొక్కల ఎదుగుదల, పుష్పధారణ, కాయల అభివృద్ధి, కాయల నిలువుదల, చివరికి దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పత్తిలో కొన్ని పోషక లోపాల లక్షణాలు పురుగులు, తెగుళ్లు, నీటి ఎద్దడి లేదా అధిక తేమ వల్ల కలిగే లక్షణాలను పోలి ఉంటాయి. ఉదాహరణకు, ఆకులు పసుపు రంగులోకి మారడం నత్రజని లోపం మాత్రమే కాకుండా నీటి ఎద్దడి, వేర్ల సమస్యలు లేదా ఇతర పోషకాల లోపం వల్ల కూడా సంభవించవచ్చు. అందువల్ల కేవలం ఆకుల రంగును చూసి వెంటనే ఎరువులు వేయడం సరికాదు. మట్టి పరీక్ష ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టడం అత్యంత శాస్త్రీయమైన పద్ధతి. అవసరమైన సందర్భాల్లో ఆకుల పోషక విశ్లేషణ, పంట పరిస్థితి, నేల లక్షణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. నత్రజని లోపం నత్రజని మొక్కల ఆకులు, కాండం, ఇతర వృక్ష భాగాలు పెరగడముకు ముఖ్యమైన పోషకం. నత్రజని లోపం సాధారణంగా పాత ఆకులలో మొదట కనిపిస్తుంది. ఆకులు లేత ఆకుపచ్చగా మారి క్రమంగా పసుపు రంగులోకి మారతాయి. మొక్కల ఎదుగుదల మందగిస్తుంది. ఆకుల పరిమాణం తగ్గుతుంది. పుష్పధారణ, కాయల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. అధిక నత్రజని కూడా మంచిది కాదు. అధికంగా నత్రజని అందించడం వల్ల మొక్కలు అధిక వృక్ష పెరుగుదలతో గుబురుగా పెరిగి, పుష్పధారణ ఆలస్యం కావచ్చు. పురుగు-తెగుళ్లకు అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి నత్రజని ఎరువులను సిఫారసు చేసిన మోతాదులో, విడతల వారీగా అందించడం మంచిది. నివారణ చర్యలు : పత్తిలో నత్రజని లోపం నివారణకు సిఫారసు చేసిన మోతాదులో నత్రజని ఎరువులను విడతలుగా వేయాలి. ఎకరాకు హైబ్రిడ్ కైతే ప్రతి సారి 25 కిలోల యూరియా 20, 40, 60, 80 రోజులకు అందించాలి. నత్రజని లోపం లక్షణాలు కనిపించినప్పుడు 1% యూరియా ద్రావణాన్ని (10 గ్రా./లీటరు నీటికి) ఆకులపై పిచికారీ చేయాలి. భాస్వరం లోపం భాస్వరం వేర్ల అభివృద్ధి, శక్తి మార్పిడి, మొక్కల ప్రారంభ ఎదుగుదలకు అవసరం. లోపం లక్షణాలు : మొక్కలు లేత ఆకుపచ్చ రంగులో ఉండి, ఎదుగుదల కుంటుపడుతుంది. ఆకులు చిన్నవిగా ఉంటాయి. లక్షణాలు మొదట కింది లేదా పాత ఆకులపై కనిపించి, క్రమంగా పై ఆకులకు వ్యాపిస్తాయి. పూత, కాయల ఏర్పాటులో ఆలస్యం జరుగుతుంది. ఆకులపై ఎర్రటి లేదా ఊదా రంగు మార్పు కనిపించవచ్చు. నివారణ చర్యలు : నేల పరీక్ష ఆధారంగా సిఫారసు చేసిన మోతాదులో భాస్వరం ఎరువులను వేయాలి. విత్తే సమయంలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా డి.ఎ.పి. వంటి భాస్వరం ఎరువులను నేలలో అందించాలి. ఎకరాకు 50 కిలోల డి.ఎ.పి.ని లేదా 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ విత్తినప్పుడు వేయాలి. భాస్వరం లోపం లక్షణాలు కనిపించినప్పుడు 2% డి.ఎ.పి. ద్రావణాన్ని (20 గ్రా./లీటరు నీటికి) ఆకులపై పిచికారీ చేయాలి. పొటాషియం లోపం పత్తిలో పొటాషియం చాలా ముఖ్యమైన పోషకం. ఇది నీటి వినియోగ సామర్థ్యం, మొక్కల దృఢత్వం, కాయల అభివృద్ధి, ఒత్తిడులను తట్టుకొనే సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. పొటాషియం లోపంలో మొదట పాత ఆకుల అంచులు పసుపు రంగులోకి మారి, తరువాత గోధుమ రంగులోకి మారి ఎండిపోయినట్లు కనిపిస్తాయి. తీవ్రమైన లోపంలో ఆకులపై మచ్చలు ఏర్పడి ఆకులు ముందుగానే రాలిపోవచ్చు. కాయల పరిమాణం, బరువు, నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది. నివారణ చర్యలు : పత్తిలో పొటాషియం లోపం నివారణకు సిఫారసు చేసిన మోతాదులో పొటాషియం ఎరువులను విడతలుగా వేయాలి. ఎకరాకు హైబ్రిడ్రైకైతే ప్రతి సారి 10 కిలోల పొటాషియం 20, 40, 60, 80 రోజులకు అందించాలి. పొటాషియం లోపం లక్షణాలు కనిపించినప్పుడు 1% పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని (10 గ్రా./లీటరు నీటికి) ఆకులపై పిచికారీ చేయాలి. మెగ్నీషియం లోపం మెగ్నీషియం క్లోరోఫిల్ లో ముఖ్యమైన భాగం. అందువల్ల ఇది కిరణజన్య సంయోగక్రియకు అవసరం. మెగ్నీషియం లోపంలో పాత ఆకులలో నరాల మధ్య పసుపుపచ్చగా కనిపిస్తుంది. నరాలు కొంతకాలం పచ్చగా ఉండి, నరాల మధ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. తీవ్రమైన లోపంలో ఆకులు ముదురుగానో మారవచ్చు. నివారణ చర్యలు : లోపం తీవ్రంగా ఉన్నప్పుడు 1% మెగ్నీషియం సల్ఫేట్ ద్రావణం (10 గ్రా./లీటరు నీటికి) ఆకులపై పిచికారీ చేయాలి. అవసరమైతే 10-15 రోజుల వ్యవధిలో పిచికారీని పునరావృతం చేయాలి. సల్ఫర్ లోపం సల్ఫర్ ప్రోటీన్ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సల్ఫర్ లోపంతో మొక్క మొత్తం లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగులోకి మారవచ్చు. ఇది నత్రజని లోపాన్ని పోలి ఉంటుంది. అయితే నత్రజని లోపం సాధారణంగా పాత ఆకుల్లో ముందుగా కనిపిస్తే, సల్ఫర్ లోపంతో కొత్త ఆకుల్లో కూడా పసుపుదనం ఎక్కువగా కనిపించవచ్చు. నేల పరీక్ష ఆధారంగా సల్ఫర్ అవసరాన్ని నిర్ణయించాలి. నివారణ చర్యలు : నేల పరీక్ష ఆధారంగా సల్ఫర్ అవసరాన్ని నిర్ణయించాలి. సిఫారసు చేసిన మోతాదులో సల్ఫర్ కలిగిన ఎరువులను, బెంటోనైట్ సల్ఫర్ లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వినియోగించాలి జింక్ లోపం జింక్ మొక్కల పెరుగుదల నియంత్రణలో ముఖ్యమైన సూక్ష్మ పోషకం. జింక్ లోపంతో కొత్త ఆకులు చిన్నవిగా మారి, నరాల మధ్య పసుపుదనం కనిపించవచ్చు. కణుపుల మధ్య దూరం తగ్గి మొక్కలు పొట్టిగా కనిపించవచ్చు. జింక్ లోపం ఉన్న నేలల్లో నేల పరీక్ష ఆధారంగా జింక్ ఎరువులను ఉపయోగించడం ద్వారా లోపాన్ని నివారించవచ్చు. నివారణ చర్యలు : జింక్ లోపం ఉన్న నేలల్లో నేల పరీక్ష ఆధారంగా జింక్ ఎరువులను ఎకరాకు 20 కిలోలు వేయాలి. జింక్ లోప లక్షణాలు కనిపించినప్పుడు జింక్ సల్ఫేట్ 0.2% ద్రావణం (2 గ్రా./లీటరు నీటికి) ఆకులపై పిచికారీ చేయాలి. అవసరమైతే 10-15 రోజుల వ్యవధిలో పిచికారీని పునరావృతం చేయాలి. ఇనుము లోపం ఇనుము క్లోరోఫిల్ ఏర్పాటుకు అవసరం. ఇనుము లోపంతో కొత్త ఆకుల్లో నరాల మధ్య పసుపుదనం కనిపిస్తుంది, అయితే నరాలు మాత్రం కొంతకాలం పచ్చగా ఉంటాయి. సున్నపు నేలలు, అధిక పి.హెచ్. ఉన్న నేలలు లేదా వేర్ల చురుకుదనం తగ్గిన పరిస్థితుల్లో ఇనుము లభ్యత తగ్గవచ్చు. నివారణ చర్యలు : ఫెర్రస్ సల్ఫేట్ 0.5% ద్రావణం (5 గ్రా./లీటరు నీటికి) ఆకులపై పిచికారీ చేయాలి. అవసరమైతే 10-15 రోజుల వ్యవధిలో పిచికారీని పునరావృతం చేయాలి. బోరాన్ లోపం బోరాన్ పత్తిలో పెరుగుతున్న కణజాలం, పుష్పధారణ, పుప్పొడి మొలకెత్తడం, కాయల అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బోరాన్ లోపంతో కొత్తగా పెరుగుతున్న భాగాలు దెబ్బతినడం, మొగ్గలు, పుష్పాల అభివృద్ధిలో లోపాలు, కాయలలో అసాధారణతలు కనిపించవచ్చు. అయితే బోరాన్ను అధిక మోతాదులో ఉపయోగించకూడదు, ఎందుకంటే అవసరానికి మించి బోరాన్ కూడా విషతుల్య ప్రభావాలను కలిగించవచ్చు. నివారణ చర్యలు : బోరాక్స్ను ఎకరాకు 4 కిలోల చొప్పున నేలకు వేయవచ్చు. బోరాక్స్ను లీటరు నీటికి 1.5 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే 2 సార్లు, 7-10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి సమగ్ర పోషక యాజమాన్యం : పత్తిలో పోషక లోపాలను నివారించడానికి ముందుగా నేల పరీక్ష చేయించుకోవాలి. నేలలో ఉన్న పోషకాల స్థాయిని బట్టి ఎరువుల మోతాదులను నిర్ణయించాలి. సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, కంపోస్ట్ వంటి వాటిని ఉపయోగించడం ద్వారా నేల భౌతిక, రసాయన, జీవ లక్షణాలను మెరుగుపరచవచ్చు. సిఫారసు చేసిన ఎన్.పి.కె. ఎరువులతో పాటు అవసరాన్ని బట్టి సల్ఫర్, జింక్, బోరాన్, ఇతర సూక్ష్మ పోషకాలను అందించాలి. ఎరువులను పంట అవసరానికి అనుగుణంగా సరైన సమయంలో, సరైన పద్ధతిలో వేయాలి. ఎరువుల వినియోగానికి ముందు మట్టి పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. ఒకే పోషకాన్ని అధికంగా ఉపయోగించకుండా సమతుల్య ఎరువుల యాజమాన్యం పాటించాలి. పత్తిలో పాత ఆకులు, కొత్త ఆకులు, పెరుగుతున్న భాగాల్లో కనిపించే లక్షణాలను పరిశీలించాలి. పోషక లోపం, పురుగు-తెగుళ్లు లేదా నీటి సమస్యను సరిగ్గా గుర్తించిన తర్వాతే నివారణ చర్యలు చేపట్టాలి. సూక్ష్మ పోషకాలను అవసరానికి మించి ఉపయోగించకూడదు. స్థానిక వ్యవసాయ శాఖ/వ్యవసాయ విశ్వవిద్యాలయ సిఫారసు ప్రకారం ఎరువుల మోతాదులను వేయాలి. ఆధారం: వ్యవసాయ పాడిపంటలు