గులాబీ అందానికి పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా పలురకాల పూలు ఉన్నప్పటికీ గులాబీలలో ఉన్న అందమైన రకాలు, ఆకర్షణీయమైన రంగులు, ప్రత్యేక మైన ఆకారాలు, పరిమితమైన సువాసన మరొక పువ్వుకు లేదు. అందుకే దీనిని పూరాణిగా పిలుస్తున్నారు. గులాబీలను పూలకోసం, ఇంటి పరిసరాల్లో కుండీలలో సాగు చేస్తున్నారు. గులాబీ పూలను స్త్రీలు అలంకరణకు, బొకేలు, పూదండలు, గృహాలంకరణ ప్రదర్శన, వివిధ కార్యక్రమాలలో అలంకరణకు వాడడం తెలిసిందే. కొన్నిరకాల పూల నుంచి ఖరీదైన నూనెను తీసి వివిధ పరిమళ ద్రవ్యాల తయారీలో వాడతారు. హెచ్.టి. గులాబీలు ఈ రకం మొక్కలు పొడవైన కాడకు పెద్ద పెద్ద పూలను పూస్తాయి.ఒక కొమ్మకు ఒకటి లేదా రెండు పూలు మాత్రమే పూస్తాయి.కాడ పొడవుగా ఉండడం వల్ల చాలాకాలం చెడిపోకుండా నిల్వ ఉంటాయి. కనుక ఈ రకాలు కట్వర్కు చాలా అనువైనవి.సాగుచేసిన రకాన్ని బట్టి ఒక్కో మొక్క నుంచి సంవత్సరానికి 100-120 పూలుపూస్తాయి. ఫ్లోరిబండా గులాబీలు ఈ రకం మొక్కలు ఒకే కొమ్మకు ఎక్కువ పూలను గుత్తులలో పూస్తాయి.పూలు మధ్యస్థ సైజులో ఉంటాయి. విడిపూలుగా అమ్మడానికి అనువుగా ఉంటాయి.గుత్తులుగా పూయడం వల్ల ఉద్యానవనాల్లో కూడా నాటుకో వచ్చు. నాటిన రకాన్ని బట్టి మొక్క నుండి సంవత్సరమునకు 225 నుండి 500 పూలుపూస్తాయి. పాలియాంథా గులాబీలు ఈ రకం మొక్కలు చిన్న ఆకులతో పొట్టిగా ఉండి చిన్నపూలను గుత్తులు గుత్తులుగా ఎక్కువ సంఖ్యలో ఒకేసారి పూస్తాయి.మొక్కలు ఎక్కువ కాలం పూలు పూస్తూనే ఉంటాయి. కనుక ఉద్యానవనాల్లో ప్లవర్ బెడ్లు, ఎడ్జ్ మొక్కలుగా పెంచుకోవచ్చు.కుండీలలో పెంచడానికి చాలా అనువుగా ఉండి అందంగా ఉంటాయి.వీటినే చిట్టిగులాబీలు, మిని యేచర్ గులాబీలు, బేబిరోజస్ అని కూడా అంటారు. డమాస్కు గులాబీలు పూల నుండి నూనె తీయడానికి అనువైన రకాలను డమాస్కు గులాబీలు అంటారు.ఈ విధంగా తీసిన నూనెను అలంకరణ సామాగ్రి, పరిమళ పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. IIHR - రకాలు ఆధారం : పాడి పంటలు డా.పి. ప్రణతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్న గూడెం, ప.గో. జిల్లా