చిరు ధాన్యాలు నూతన వంగడాల సాగుతోనే మెరుగైన ఆదాయం చిరు ధాన్యాల పంటలలో ఎక్కువ విస్తీర్ణంలో జొన్న, సజ్జ, రాగి, కొర్ర పంటలను కొద్దిపాటి విస్తీర్ణంలో సామ, అరిక, వరిగ, ఊద, అండుకొర్ర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇటీవల చిరుధాన్యాల సాగు, వాడకం మీద అవగాహన పెరగడం వలన రైతులు చిరుధాన్యాల పంటల సాగు మీద ఆసక్తి పెరిగింది. చిరుధాన్యాలను తక్కువ సారం భూముల్లో, సరైన యాజమాన్య పద్ధతులను సకాలంలో పాటించకపోవడం వల్ల తక్కువ దిగుబడు లు వస్తుంటాయి. రైతులు చిరుధాన్యాల పంటలలో లాభాలు పొందాలంటే దిగుబడులను పెంచాల్సిన అవసరం ఉంది. దిగుబడులను పెంచడానికి అధిక దిగుబడిని ఇచ్చే రకాలను సాగు చేయడం, సాగు మెళకువలను పాటించడం, సకాలంలో కలుపు నివారణ, అంతరకృషి, సస్యరక్షణ చర్యలను పాటించడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు. విత్తన రకాల ఎంపిక ఏ పంటలోనైనా అధిక దిగుబడులను పొందడానికి మేలైన అధిక దిగుబడి రకాల ఎంపిక చాలా అవసరం. చిరుధాన్యాలలో ఎక్కువగా స్థానిక రకాలను సాగు చేయడం వలన తక్కువ దిగుబడి వస్తున్నది. స్థానిక రకాలకు ఎక్కువగా చీడపీడలను తట్టుకొనే గుణం ఉండవు కావున చీడ పీడలను తట్టుకునే నూతన వంగడాల విత్తనాన్ని సేకరించుకొని సాగు చేయాలి. వివిధ చిరుధాన్యాల పంటలలో మన రాష్ట్రంలో సాగు చేయడానికి అనువైన రకాల వివరాలు. జొన్న రకాలు : ఎన్.టి.కె. 4, ఎన్.టి.జె.5, సి.ఎస్.వి. 216 ఆర్, సి.ఎస్.వి. 18, సి.ఎస్.వి. 22, ఎన్. 15 (పచ్చ జొన్న)జొన్న హైబ్రిడ్స్: సి.ఎస్. హెచ్. 14, సి.ఎస్.హెచ్. 16, సి.ఎస్.హెచ్.18, సి.ఎస్.హెచ్. 21. సి.ఎస్.హెచ్. 13, సి.ఎస్.హెచ్., 15, సి.ఎస్.హెచ్ 16, సి.ఎస్.హెచ్.32 ఆర్.సజ్జ రకాలు: ఐ.సి.ఎం. 221, ఐ.సి.టి.పి. 8203, ధనశక్తి, పి.బి.వి.04సన్న హైబ్రిడ్ రకాలు: APHB 126, హెచ్.హెచ్.బి.67, ఐ.సి.ఎం.హెచ్.356, ఆర్. హెచ్.బి.121, పి. హెచ్.బి.3రాగి : వకుల, శ్రీచైతన్య, తిరుమల, గౌతమి, వేగవతి, సువర్ణముఖి, ఇంద్రావతి, గోస్తని, హిమ (తెల్ల రాగి రకం).కొర్ర : ఎస్.ఐ.ఏ.3085, ఎస్.ఐ.ఏ.3156, సూర్యనంది, గరుడ (ఎస్.ఐ.ఏ. 3222), రేనాడు (ఎస్.ఐ.ఏ. 3223) మహానంది. సామ : బి.ఎల్.6, డి.హెచ్.ఎల్.ఎం.36-3, ఒ.ఎల్. యం.203, జె.కె.8.ఊద: డి.హెచ్.బి.ఎం.93-3, కో2, వి.ఎల్.మధిర 172అరిక : టి.ఎ ఎస్.యు.86, డి.పి.ఎస్.9-1, జె.కె.98, జె.కె 65, జె.కె.13, జె.కె.48.వరిగ : ఎన్.టి.ఎ.యు.202, టి.ఎన్.ఎ.యు.164, టి.ఎన్.ఎ.యు.151, టి.ఎన్.ఎ.యు.143, పి.ఆర్.18, కొ.4.అందు కొర్ర: జి.పి. బి.టి.6, టి.ఎస్.బి.ఆర్ 001 విత్తన మోతాదు, విత్తు దూరం సరైన విత్తన మోతాదు ను సరైన దూరంలో విత్తినప్పుడు మొక్కల సాంద్రత సరిగా ఉండి దిగుబడులు పెరగడానికి అవకాశం ఉంటుంది. వెదజల్లే పద్ధతిలో విత్తినప్పుడు కలుపును ఖచ్చితంగా కూలీలతో తీయించాలి. సాళ్ళలో విత్తినప్పుడు దంతితో కాని, చిన్న ట్రాక్టరుతో గాని న అంతరకృషి చేయించడానికి వీలుంటుంది. ట్రాక్టరుతో సాళ్ళను 2-3 సెం.మీ. లోతు సాళ్ళను తీసి విత్తనం వేసి బల్ల నడపడం ద్వారా విత్తనం మట్టిలో కప్పబడి మొలక శాతం పెరుగుతుంది. విత్తన శుద్ధి విత్తన శుద్ధి చేయడంవలన పంట తొలి దశలో వచ్చే చీడపీడలను నివారించడానికి వీలుంటుంది. జొన్న : ఒక కిలో విత్తనానికి 10 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ ద్రావణాన్ని కలిపి విత్తనశుద్ధి చేస్తే మొవ్వు ఈగ నుండి పంటను తొలి దశలో కాపాడుకోవచ్చు. థయోమిథాక్సామ్ 3గ్రా./ కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి.సజ్జ : విత్తనాలను 2% (20గ్రా, ఉప్పు లీటరు నీటికి) ఉప్పు ద్రావణంలో 10 నిమిషాలు ఉంచడం ద్వారా ఎర్గాట్ శిలీంధ్ర అవశేషాలను తేలేటట్లు చేసి తొలగించవచ్చు. ఆరిన తరువాత విత్తనానికి 3 గ్రా. చొప్పున ధైరమ్ కలిపి విత్తనాన్ని శుద్ధి చేయాలి.రాగి, కొర్ర/సామ /వరిగ ఆరిక/ఊద/ అండు కొర్ర : కిలో విత్తనానికి 2 గ్రా. ట్రైసైక్లోజోల్ 7.5 డబ్ల్యూ.పి. లేదా 2గ్రా. కార్బండిజమ్ లేదా 3 గ్రా. కాప్టాన్ కలిపి విత్తన శుద్ధి చేస్తే పంట తొలి దశలో చీడపీడలు రాకుండా నివారించవచ్చు. కలుపు నివారణ, అంతరకృషి జొన్న/ సజ్జ : విత్తిన 24-48 గంటలలో అట్రాజిన్ మందును ఎకరాకు 800 మి.లీ. మందును 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేయాలి. రాగి: రాగి పంటను నేరుగా విత్తే పద్ధతిలో సాగు చేసినపుడు సహజంగా పెరిగే గడ్డిజాతి, వెడల్పాకు కలుపు నివారణకు బెన్ సల్ఫ్యూరాన్ మిథైల్ + ప్రిటిలాక్లోర్ ఎకరాకు 1200 గ్రా. చొప్పున విత్తిన 24-48 గంటలలో పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చోడి పంటను నాట్లువేసే పద్దతిలో సాగు చేసినపుడు నాట్లు వేసిన 24-48 గంటలలో బెన్ సల్ఫ్యూరాన్ మిథైల్ + ప్రిటిలాక్లోర్ ఎకరాకు 1200 గ్రా. చొప్పున లేదా పెండిమిథాలిన్ను ఎకరాకు 1 లీటరు చొప్పున పిచికారీ చేయాలి. దీనితో పాటు 30-35 రోజుల మధ్య ఒకసారి అంతరకృషి చేసినట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు. నాట్లు వేసిన 25-30 రోజులకు వెడల్పాకు కలుపు మొక్కల నిర్మూలనకు ఎకరాకు 100 మి.లీ. ఇథాక్సీ సల్ఫ్యూరాన్ లేదా 400 గ్రాముల 2,4-డి సోడియం సాల్ట్ పిచికారీ చేయాలి. కొర్ర : విత్తిన 24-48 గంటలలో బ్యుటాక్లోర్ (50 ఇసి) ఎకరాకు 600మి.లీ. లేదా ప్రిటిలాక్లోర్ ఎకరాకు 300 మి.లీ. లేదా ఆక్సాడయార్జిల్ ఎకరాకు 28 గ్రా. చొప్పున పిచికారీ చేయాలి. దీనితో పాటు 25-30 రోజులకు ఒక అంతర కృషి చేసినట్లయితే కలుపు సమర్థంగా నిర్మూలించబడుతుంది. సామ /వరిగ ఆరిక/ ఊద/ అండు కొర్ర : విత్తిన 24-48 గంటలలో బెన్ సల్ఫ్యూరాన్ మిథైల్ + ప్రిటిలాక్లోర్ ఎకరాకు 1200 గ్రాములు చొప్పున పిచికారీ చేయాలి. దానితో పాటు 25-30 రోజులకు ఒక అంతర కృషి చేసినట్లయితే కలుపు సమస్య తగ్గి అధిక దిగుబడులు సాధించవచ్చు. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక , వ్యవసాయ పరిశోధనా స్థానం, కదిరి.