ఎల్ నినో కారణంగా మారుతున్న వాతావరణం, వరి పంటలో పురుగు- తెగుళ్ల ఉధృతి భారతదేశంలో వ్యవసాయం ప్రధానంగా నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. అయితే కొన్ని సంవత్సరాలలో ఎల్న్ని కారణంగా వర్షపాతం తగ్గడం, అధిక ఉష్ణోగ్రతలు, దీర్ఘకాలం పొడి వాతావరణం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. తెలంగాణలో కూడా ఎల్నినో సంవత్సరాల్లో ఆలస్యంగా వర్షాలు పడటం, వరి నాట్లు ఆలస్యం కావడం, నీటి కొరత ఏర్పడటం సాధారణంగా కనిపిస్తుంది. ఈ వాతావరణ మార్పులు వరి పంటలో పురుగులు, తెగుళ్ల వ్యాప్తిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. ఎల్నినో అంటే ఏమిటి? పసిఫిక్ మహాసముద్రంలోని తూర్పు, మధ్య భాగాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరిగే పరిస్థితిని ఎల్నినో అంటారు. దీని ప్రభావంతో భారతదేశంలో సాధారణంగా వర్షపాతం తగ్గి, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఫలితంగా పంటలు నీటి ఎద్దడికి గురవుతాయి. తెలంగాణ వరి పంటలో ఎల్నినో వలన పురుగులు, తెగుళ్లపై ప్రభావం కాండం తొలిచే పురుగు/మొగి పురుగు: ఎల్నినో సంవత్సరాల్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ పురుగు జీవిత చక్రం వేగంగా పూర్తవుతుంది. దీంతో తరాలు పెరిగి, డెడ్ హార్ట్ (మొవ్వులు ఎండి మొక్కలు చనిపోవడం), తెల్లకంకి లక్షణాలు అధికంగా కనిపించే అవకాశం ఉంటుంది. ఆకు ముడత పురుగు : వేడి వాతావరణం, మధ్య మధ్యలో పడే తేలికపాటి వర్షాలు ఈ పురుగు అభివృద్ధికి అనుకూలంగా ఉంటాయి. ఆకులను చుట్టుకొని లోపలి భాగాన్ని తినడం వల్ల కిరణజన్య సంయోగక్రియ తగ్గి దిగుబడి తగ్గుతుంది. తామర పురుగులు : పొడి వాతావరణంలో తామర పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆకుల నుంచి రసాన్ని పీల్చి ఆకులు తెల్ల రంగులోకి మారేలా చేసి మొక్క ఎదుగుదలను తగ్గిస్తాయి. తాటాకు తెగులు తక్కువ తేమ, అధిక ఉష్ణోగ్రతలపరిస్థితుల్లో ఈ పురుగు వేగంగా అభివృద్ధి చెందుతుంది. పురుగులు గీకి తినడం వల్ల ఆకులపై తెల్లని నిలువు చారలు ఏర్పడడం దీని ముఖ్య లక్షణం. సుడిదోమ : పొడి పరిస్థితుల్లో సాధారణంగా ఈ పురుగు కొంత తగ్గినప్పటికీ, తరువాత అధిక నత్రజని ఎరువులు వేయడం, నిరంతర నీటిపారుదల కల్పించడం వల్ల ఒక్కసారిగా ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల రైతులు తరచుగా పొలాలను పరిశీలించాలి. ఉల్లికోడు : రుతుపవనాలు ఆలస్యమై నాట్లు ఆలస్యమవడం వలన ఉల్లికోడు ఉదృతి అధికమయ్యే అవకాశం ఉంది. నారుమడి/ పిలక దశలో అంకురం ఉల్లి కాడవలే లేత ఆకుపచ్చని పొడుగాటి గొట్టంగా మారడం గమనిస్తాం.ఆకునల్లి వర్షాభావ పరిస్థితులు, అధిక నత్రజని ఎరువుల వినియోగంతో పాటు అధిక ఉష్ణోగ్రతల కారణం గా ఆకులపై చిన్న తెలుపు మచ్చలు ఏర్పడి క్రమేపి బూడిద రంగుకి మారతాయి. గోధుమ మచ్చ తెగులు : ఎల్నినో సంవత్సరాల్లో ఎక్కువగా కనిపించే తెగుళ్లలో ఇది ఒకటి. నీటి కొరత, పోషక లోపాలు ఉన్న పొలాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అగ్గి తెగులు : వేడి వాతావరణంతో పాటు మధ్య మధ్యలో తేమ పెరిగితే అగ్గి తెగులు వ్యాపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఎల్నినో పరిస్థితుల్లో వరి పంటలో సమగ్ర పురుగు-తెగుళ్ల యాజమాన్యం ఎల్నినో పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం, నీటి కొరత వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కింది సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా పురుగులు, తెగుళ్ల వల్ల కలిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. తక్కువ నీటితో పెరిగే, ఎండను తట్టుకునే, తక్కువ కాలపరిమితి గల వరి రకాలను ఎంపిక చేసుకోవాలి. వాతావరణ శాఖ వర్ష సూచనలను అనుసరించి సరైన సమయంలో నారు పోసుకొని, నాట్లు వేయాలి. మొక్కల మధ్య తగినంత దూరం పాటించడం ద్వారా గాలి ప్రసరణ మెరుగు పడి, తెగుళ్ల వ్యాప్తి తగ్గుతుంది. అధిక మోతాదులో నత్రజని ఎరువులు వేయకుండా, భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువుల యాజమాన్యాన్ని పాటించాలి. నీటి లభ్యతను బట్టి ప్రత్యామ్నాయ తడి పొడి విధానం ద్వారా నీటిని పొదుపుగా వినియోగించాలి. వారానికి కనీసం ఒకసారి పొలాలను పరిశీలించి పురుగులు, తెగుళ్ల ఉధృతిని గమనించాలి. కాంతి ఎరలు, పసుపు రంగు జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసి పురుగుల ఉధృతిని గమనించుకోవాలి. పొలాల్లో సాలీడులు, మిరిడ్ బగ్స్, తూనీగలు వంటి మిత్రకీటకాలను సంరక్షించడం ద్వారా పంటను నష్ట పరిచే పురుగులను సహజంగా నియంత్రించవచ్చు. పురుగుల ఉధృతి ఆర్థిక నష్ట పరిమితి స్థాయి దాటినప్పుడు మాత్రమే సిఫార్సు చేసిన పురుగుమందులను ఉపయోగించాలి. తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉండి, వాతావరణ పరిస్థితులు వాటి వ్యాప్తికి అనుకూలంగా ఉన్నప్పుడు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు శిలీంధ్రనాశక మందులను పిచికారీ చేయాలి. ఎల్నినో ప్రభావాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, ముందస్తు వాతావరణ సమాచారం, సమయానుకూల పంట నిర్వహణ, క్రమం తప్పకుండా పంట పరిశీలన, సమగ్ర పురుగు-తెగుళ్ల యాజమాన్య పద్ధతులను అనుసరించడం ద్వారా వరి పంటను రక్షించి దిగుబడిని కాపాడుకోవచ్చు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరించుకోవాలి. ఆధారం: వ్యవసాయ పాడిపంటలు