వరిలో యాజమాన్య పద్ధతులు ఎల్ నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఉత్తర కోస్తా మండలం (విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి), కృష్ణా మండలం (బాపట్ల, పల్నాడు ప్రకాశం, మార్కాపురం), అత్యల్ప వర్షపాత మండలం (సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల), కొంత మేర ఇతర జిల్లాలలో సాధారణ విస్తీర్ణం కన్నా వరి సాగు గణనీయంగా తగ్గింది. ఆయా ప్రాంతాలలో భూమి పరిస్థితిని బట్టి మెట్ట పంటలు వేసుకోవాలి. అక్టోబర్ మాసానికి జులైలో విత్తిన వరి పొలాలు పూత దశలో ఉంటాయి. ఆగస్టులో ఆలస్యంగా నాటిన పొలాలు చిరుపొట్ట దశలో ఉంటాయి. కావున ఈ కింది సూచనలు పాటించాలి. చిరుపొట్ట దశలో ఉన్న వరిలో గింజ నాణ్యత, గింజ బరువు, పురుగులు, తెగుళ్ళను తట్టుకునే శక్తి పెరగడానికి చివరి దఫాగా సిఫారసు చేసిన నత్రజని ఎరువుతో పాటు ఎకరాకు 20-25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను తప్పనిసరిగా వేసుకోవాలి. ఆలస్యంగా నాట్లు వేసి, పిలక దశలో ఉన్న వరి పొలంలో రెండవ దఫా సిఫారసు చేసిన నత్రజని వేసుకుంటే సరిపోతుంది. సార్వాలో బాగా ఆలస్యంగా ముఖ్యంగా ముదురు నారు వేసిన వరి సిఫారసు చేసిన ఎరువుల మోతాదును 25% పెంచి రెండు దఫాలుగా మాత్రమే, యం.టి.యు. 1318కి 70% దమ్ములోను, 30% చిరుపొట్ట దశలో వేసుకోవాలి. ఇతర రకాలకు సిఫారసు చేసిన నత్రజనిలో 75% దమ్ములోను, 25% చిరుపొట్ట దశలో వేసుకోవాలి. పురుగులు, తెగుళ్ళ ఉధృతి పెరగకుండా ఉండటానికి నత్రజని ఎరువును సిఫారసు చేసిన మోతాదు మేరకే వాడాలి, విచక్షణారహితంగా వాడకూడదు. మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అవసరానికి మించి నీరు పెట్టకుండా, ఎరువులు సమతుల్యంగా వాడితే కోత సమయంలో పంట పడిపోవటాన్ని నివారించవచ్చు.వరి పంట పూత దశలో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. చౌడు భూములలో తరచూ నీరు మార్చాలి. ఆలస్యంగా నాట్లు వేసిన వరి పొలాల్లో ఉల్లికోడు ఆశించడానికి అవకాశం ఉన్నది. నివారణకు ఎకరానికి కార్బోఫ్యూరాన్ 3 జి గుళికలు 10 కిలోలు లేదా ఫిప్రోనిల్ 0.3జి గుళికలు 10 కిలోలు వేసుకోవాలి. ఆకుముడత, కాండం తొలుచు పురుగు నివారణకు ఎకరానికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 60 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. చిరుపొట్ట దశలో ఎకరానికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలు 8 కిలోలు లేదా కార్బోఫ్యురాన్ 3జి గుళికలు 10 కిలోలు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 0.4జి గుళికలు 4 కిలోలు వేసుకోవాలి. బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు నిర్ధారణ కోసం ఎండిన ఆకులను ముక్కలుగా కత్తిరించి మంచి నీటి గాజుగ్లాసులో వేసి. అరగంట తరువాత నీటిని పరిశీలిస్తే, తెగులు ఆశించిన భాగాల నుంచి బ్యాక్టీరియా నీటిలోకి ప్రవేశించడం వల్ల నీటి గాఢత పెరిగి, పసుపు రంగుకు మారుతుంది. ఈ లక్షణాలను బట్టి ఆ పంటను బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఆశించినట్లుగా గుర్తించాలి. తెగులు లక్షణాలు గమనించిన వెంటనే పొలంలో నీటిని రెండు, మూడు సార్లు మురుగు నీటి కాలువల ద్వారా బయటకు తీసివేసి కొత్త నీరు పెట్టడం వల్ల ఉధృతి తగ్గుతుంది. సిఫారసు చేసిన పొటాష్‌ను మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో రెండు దఫాలుగా నాట్లు వేసే సమయంలోనూ, చిరుపొట్ట దశలోనూ వేయాలి.తెగులు సోకిన పొలానికి నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. ముఖ్యంగా బీపీటీ 5204, ఎంటి యూ 1121, ఎంటీయూ 1318 రకాలకు నత్రజని నియంత్రించాలి. ఆధారం: పాడి పంటలు , ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మార్టేరు, పశ్చిమ గోదావరి.