వాణిజ్య పరంగా పండించే పండ్లలో దానిమ్మ ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్ లో దానిమ్మ అనంత పురం, కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 9,466 హెక్టార్లలో సాగవుతోంది, 1,39,019 టన్నుల దిగుబడినిస్తున్నది. దానిమ్మలో రకాలు దానిమ్మలో గణేష్, భగువ, మృదుల, రూబీ, ఫూలే అరక్త, కాంధారి, జ్యోతి, పి-26, ధోల్కా, పూలే భగువ సూపర్ వంటి రకాలున్నాయి. గణేష్ : కాయలు 250-280 గ్రా. సగటు బరువు, ఆకర్షణీయమైన గులాబీ రంగుతో పసుపు వర్ణం కలిగి ఉంటాయి. చక్కెర శాతం 15.5° బ్రిక్స్ ఉండి, శీతాకాలంలో పింక్ రంగు, వేసవిలో తెలుపు గింజలు కలిగి ఉంటుంది. విత్తనాలు మృదువుగా కాయలు ఉంటాయి. 145-155 రోజుల్లో కోతకు వస్తాయి.మృదుల: కాయలు 230-270 గ్రా. బరువు, ముదురు పింకురంగు గింజలు ఉంటాయి. ఆంత్రాక్నోన్ మచ్చరోగాన్ని గణేష్ కంటే బాగా తట్టుకొంటుంది. చక్కెర శాతం 18° బ్రిక్స్ వరకు ఉంటుంది. కాయలు 140-150 రోజుల్లో కోతకు వస్తాయి. ఎగుమతికి అనుకూలమైన రకం.భగువ : కాయలు 250-300 గ్రా. బరువు, తోలు, గింజలు ముదురు పింకురంగులో ఉంటాయి. తోలు మందం కాబట్టి ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. మృదువైన గింజలు ఎక్కువ తీపి (16° బ్రిక్స్ ). ఎగుమతికి అనుకూలం. కాయలు 180-190. రోజుల్లో కోతకు వస్తాయి. సోలాపూర్ లాల్ : 130-140 కాయలు చెట్టుకి కలిగి 200-250 గ్రా. బరువు, తోలు, గింజలు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. భగువ రకంతో పోలిస్తే గింజలు కొంచెం గట్టిగా ఉండి తీపిదనం 17.5-17.70 బ్రిక్స్ కలిగి ఉంటాయి. కాయలు 160-165 రోజుల్లో కోతకు వస్తాయి. భగువ రకంతో పోలిస్తే 15-20 రోజులు ముందే కోతకు వస్తుంది. జింకు, ఇనుము విటమిను 'సి' అధికంగా ఉండడం వల్ల బయోఫోర్టిఫైడ్ రకం ఎన్.ఆర్.సి సోలాపూర్ విడుదల చేసింది. ప్రవర్ధనం దానిమ్మను నేల అంట్లు, గాలి అంట్లు లేదా కొమ్మల కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. మంచి దిగుబడినిచ్చే ఆరోగ్యవంతమైన మొక్కల నుంచి కొమ్మలను కత్తిరించాలి. ఏడాది వయసున్న ముదురు కొమ్మలను 9-12 అంగుళాల పొడవు గల ముక్కలుగా కత్తిరించి నాటుకోవాలి. మొక్కల మొదలు నుంచి వచ్చే కొమ్మ కత్తిరింపులు నాటుకుంటే ఎక్కువగా సఫలమవుతాయి. కత్తిరించిన కొమ్మల అడుగు భాగాన్ని సెరడిక్స్ పౌడర్ అద్ది 4-6 కణుపులు భూమిలో ఉండేలా నాటుకుంటే వేర్లు తొడిగే అవకాశం ఎక్కువ. ఆరునెలల కంటే తక్కువ, 18 నెలల కంటే ఎక్కువ వయసున్న కొమ్మలను కత్తిరింపుల కోసం ఎన్నుకోరాదు. వేర్లు తొడిగిన కత్తిరింపులు 9 నెలల్లో నాటడానికి అనువుగా ఉంటాయి. వర్షాకాలం ప్రారంభంలో ప్రవర్ధనం చేస్తే ఎక్కువ వేర్లు తొడిగే అవకాశం ఉంటుంది. 25-30 రోజుల్లో వేర్లు తొడిగి 3 నెలలకు నాటడానికి అనువుగా ఉంటాయి. టిష్యూకల్చర్ పద్ధతిలో కూడా దానిమ్మను ప్రవర్థనం చేయవచ్చు. టిష్యూ కల్చర్ దానిమ్మ మొక్కలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. నాటటం రకం, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి 4.5 మీ. × 3.0 మీ. లేదా 4 మీ. × 4 మీ. దూరాన్ని నిర్ణయించుకోవాలి. డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టడానికి అవకాశం ఉంటే జూన్ నుంచి మార్చి వరకు నాటుకోవచ్చు. 60×60×60 సెం.మీ. గుంతలు తీసి నెల రోజుల వరకు గుంతలను సూర్యరశ్మికి ఆరనివ్వాలి. ప్రతి గుంతకు 20 కేజీల పశువుల ఎరువు, 2 కేజీల వానపాముల ఎరువు, 3 కేజీల వేపపిండి, 25 గ్రా. ట్రైకోడెర్మా విరిడి, 15 గ్రా. పాస్ఫోబాక్టీరియా,15 గ్రా. అజటోబాక్టర్ ను మట్టితో కలిపి గుంతలు నింపాలి. ఎరువులు ఒక్కొక్క మొక్కకు మొదటి సంవత్సరంలో మొక్కలు నాటిన నాలుగు నెలల తర్వాత 125 గ్రా. వేపపిండి + 5 కిలోల చివికిన పశువుల ఎరువు, 7 నెలల తర్వాత 250 గ్రా. వేపపిండి + 10 కిలోల చివికిన పశువుల ఎరువు.11 నెలల తర్వాత 750గ్రా. వేపపిండి + 10 కిలోల చివికిన పశువుల ఎరువును వేసుకోవాలి. ప్రతి మొక్కకు సాలీనా 30 కిలోల పశు వుల ఎరువు, 625 గ్రా. నత్రజని, 250గ్రా. భాస్వరం, 250గ్రా. పొటాష్ దఫాలుగా మొదట తడికి ముందు, తర్వాత కాయ ఎదిగే దశలలో వేయాలి. జింకు లోపమున్న ఆకులు చిన్నవిగా, వంకర్లు తిరిగి ఉంటాయి. జింకు లోపాన్ని సవరించడానికి లీటరు నీటికి 5 గ్రా. జింకు సల్ఫేట్ ను కలిపి 1-2 సార్లు కొత్తచిగుళ్ళు ఉన్నప్పుడు పిచికారీ చేయాలి.ఇనుప ధాతువు లోపించిన ఆకులు తెల్లబడతాయి. నివారణకు 2.5 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నీటి తడులు సక్రమంగా ఉన్నా బోరాన్ లోపించినప్పుడు లేతకాయల్లో పగుళ్ళు ఏర్పడతాయి. బోరాన్ లోప నివారణకు 12.5 గ్రా. బోరాక్స్ ను చెట్ల పాదులకు వేయాలి లేదా లీటరు నీటికి 2 గ్రా. బోరాన్ కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. కలుపు నివారణ వర్షాకాలంలో రెండు సార్లు తోటంతా దున్నడం వల్ల కలుపు మొక్కలను అదుపులో ఉంచటమే కాకుండా నేల గుల్ల బారి వాననీరు ఇంకుతుంది. వర్షాకాలంలో తొలకరి వర్షాల తర్వాత అట్రాట్రాఫ్ ఎకరానికి 800గ్రా. 240 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ కలుపు మందు దానిమ్మ మొక్కలపై పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. నీటి యాజమాన్యం నేలలో తేమ శాతం ఒకే విధంగా ఉండాలి, లేకపోతే కాయలు పగులుతాయి. మార్చి నుంచి జులై వరకు భూమిలో తేమ సమంగా ఉండేలా నీటి తడులు ఇవ్వాలి. దానిమ్మకు 0.5 మిల్లి మోస్/ సెం.మీ. విద్యుత్ వాహకత గల ఉ ప్పు నీరు కూడా ఉపయోగించవచ్చు. డ్రిప్ పద్ధతిలో నీరు పెడితే చెట్టు పెరుగుదల, కాయల సంఖ్య, బరువును 35 శాతం వరకు పెంచవచ్చు. ఫర్టిగేషన్ (నీరు + రసాయన ఎరువులు) పద్ధతిలో కాయల బరువు, నాణ్యత పెరుగుతుంది. చెట్టు పై పూత, కాయలు లేని సమయంలో నీటితడులు తగ్గించాలి. వేరుశనగ పొట్టు లేదా వరిపొట్టుతో 8 సెం.మీ. మందంతో చెట్ల పాదుల్లో మల్చింగ్ చేయాలి. ఆధారం: పాడి పంటలు డా.వి.రమణ, ఉద్యాన శాస్త్రవేత ( ఉద్యాన విభాగం ), ఉద్యాన పరిశోధన స్థానం, అనంతపురం.