పొద్దు తిరుగుడు : నీరు - సమగ్ర పోషక యాజమాన్యం భారతదేశంలో ప్రొద్దుతిరుగుడు సాగు ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో ఎక్కువగా సాగులో ఉంది. ఈ నూనెలో అధికంగా అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (ముఖ్యంగా లినోలిక్ ఆమ్లం 55-65%) ఉండటం వలన, ఇది గుండె సంబంధ వ్యాధులు తగ్గించడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పొద్దుతిరుగుడు రబీలో సాగు చేసినప్పుడు చీడపీడల బెడద తక్కువగా ఉండి, గింజ నాణ్యత, దిగుబడి మెరుగ్గా ఉంటుంది. పంట కాలం కేవలం 90-100 రోజులు. వేరువ్యవస్థ 1.5 నుంచి 2 మీటర్ల లోతు వరకు వెళ్లి నేల అడుగు పొరల్లోని తేమను కూడా వినియోగించుకుంటుంది. అందువల్ల ఖరీఫ్ పంట తర్వాత నేలలో మిగిలిన తేమతో, లేదా ఒకటి రెండు తడులతోనే మంచి దిగుబడి సాధించగల పంటగా చెప్పుకోవచ్చు. అయితే పరిమిత నీటి పరిస్థితుల్లో అధిక దిగుబడి రావాలంటే సరైన సమయంలో విత్తటం, నేలలోని తేమను కాపాడుకోవటం, సమతుల పోషకాలు అందించటం వంటి అంశాలపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విత్తే సమయం, దిగుబడికి మొదటి మెట్టు రబీ పొద్దుతిరుగుడులో దిగుబడిని నిర్ణయించే అతి ముఖ్యమైన అంశం విత్తే సమయం. పంట పూత, గింజ నిండే దశలు మరీ ఎక్కువ వేడి గాని, మరీ ఎక్కువ చలి గాని లేని కాలంలో వచ్చేలా విత్తుకోవాలి. పూత సమయంలో ఉష్ణోగ్రత 20-30° సెంటీగ్రేడ్ మధ్య ఉంటే పరాగ సంపర్కం బాగా జరిగి గింజలు నిండుగా ఏర్పడతాయి. ప్రాంతం / పరిస్థితి అనువైన విత్తే సమయం మెట్ట ప్రాంతాలు (రాయలసీమ, ప్రకాశం, పల్నాడు), అక్టోబరు రెండవ పక్షం నుంచి నవంబరు మొదటి పక్షం, నీటి పారుదల / బోరు బావుల కింద అక్టోబరు చివరి వారం నుంచి నవంబరు కోసిన చివరి వరకు, వరి మాగాణుల్లో (వరి తర్వాత) వరి వెంటనే, సాధ్యమైనంత వరకు డిసెంబరు మొదటి పక్షంలోపు విత్తన మోతాదు, విత్తే పద్ధతి తక్కువ నీటి పరిస్థితులకు 85-95 రోజుల్లో కోతకు వచ్చే, బెట్టను తట్టుకునే సంకర రకాలు లేదా సూటి రకాలను ఎంపిక చేసుకోవాలి. ఎకరాకు విత్తన మోతాదు సంకర రకాలు 2 కిలోలు, సాధారణ రకాలు 3-4 కిలోలు, వరుసల మధ్య × మొక్కల మధ్య దూరం సంకర రకాలు 60×30 సెం.మీ., సాధారణ రకాలు 45-60x 20-30 సెం.మీ, ఎకరాకు మొక్కల సంఖ్య 22,000-29,000 ఉండేలా చూసుకోవాలి. విత్తనాన్ని 3-5 సెం.మీ. లోతులో, తేమ ఉన్న పొరలో పడేలా గొర్రుతో విత్తాలి. గుంతకు 2 విత్తనాలు వేసి, విత్తిన 15-20 రోజులకు పలుచన చేసి గుంతకు ఒకే బలమైన మొక్క ఉంచాలి. సరైన మొక్కల సాంద్రత ఉంటేనే నేలలోని పరిమిత తేమ, పోషకాలు ప్రతి మొక్కకు సమానంగా అందుతాయి. మొక్కలు మరీ దగ్గరగా ఉంటే తేమ కోసం పోటీ పెరిగి పువ్వులు చిన్నవిగా వస్తాయి. నీటి యాజమాన్యం-కీలక దశల్లోనే తడులు కీలక దశల్లో మాత్రమే తడి ఇస్తే తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. ఈ దశల్లో బెట్ట తగిలితే దిగుబడి భారీగా పడిపోతుంది.పంటకు నేల స్వభావాన్ని బట్టి 4-6 తడులు అవసరం. తేలిక నేలల్లో 8-10 రోజులకు ఒకసారి, నల్లరేగడి నేలల్లో 15 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. మొగ్గ దశ, పువ్వు దశ మరియు గింజ కట్టే దశల్లో నీరు తప్పనిసరిగా ఇవ్వాలి. నీటి పొదుపు పద్ధతులు సాలు విడిచి సాలుకు తడి: బోదెలు, కాలువల పద్ధతిలో ఒకదాని తర్వాత ఒక కాలువకు నీరు పెట్టి, తర్వాతి తడిలో మిగిలిన కాలువలకు ఇవ్వాలి. దీని వల్ల దిగుబడి పెద్దగా తగ్గకుండా సుమారు 30-35% నీరు ఆదా అవుతుంది. బిందు తుంపర సేద్యం: బోరు బావుల కింద బిందు సేద్యం ద్వారా 40-50% నీరు ఆదా అవుతుంది. బిందు సేద్యం ద్వారా నత్రజని, పొటాష్ ఎరువులను కూడా దఫాలుగా ఇవ్వవచ్చు. నీరు నిలిస్తే వేరుకుళ్లు తెగులు వస్తుంది. గాలులు ఎక్కువగా ఉన్నప్పుడు పూత తర్వాత తడి ఇస్తే మొక్కలు పడిపోయే అవకాశం ఉంది. సమగ్ర పోషక యాజమాన్యం సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, రసాయన ఎరువులను కలిపి సమతుల్యంగా వాడటమే సమగ్ర పోషక యాజమాన్యం. తక్కువ నీటి పరిస్థితుల్లో రసాయన ఎరువుల సామర్థ్యం తగ్గుతుంది కాబట్టి, సేంద్రియ పదార్థంతో కలిపి వాడితే పోషకాలు వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. సేంద్రియ ఎరువులు ఎకరాకు 4 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు లేదా 1 టన్ను వర్మికంపోస్టు ఆఖరి దుక్కిలో వేయాలి. వీలైన చోట ఖరీఫ్ లో జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట పంటలు వేసి కలియదున్నితే నేల సారం, నీటి నిల్వ శక్తి పెరుగుతాయి. జీవన ఎరువులు ఎకరాకు 2 కిలోల అజోస్పైరిల్లం, 2 కిలోల ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియాను 100 కిలోల పశువుల ఎరువులో కలిపి, వారం రోజులు నీడలో ఉంచి అఖరి దుక్కిలో వేయాలి. దీని వల్ల నత్రజని, భాస్వరం ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. రసాయన ఎరువులు వర్షాధార పంటలో : ఎకరాకు 24 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 12 కిలోల పొటాష్ అందించాలి. నత్రజనిని రెండు దఫాలుగా చేసి సగభాగం, విత్తే సమయంలో, మిగిలిన సగభాగం విత్తిన 30 రోజుల తరువాత వేయడం మంచిది. భాస్వరం, పొటాష్ ఎరువులను సాధారణంగా విత్తే సమయంలోనే వేయాలి. నీటిపారుదల కింద: ఎకరాకు 30 కిలోల నత్రజని, 36 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్ చొప్పున అందించాలి. నత్రజనిని మూడు దఫాలుగా చేసి 50% విత్తే సమయంలో, 25% మొగ్గ దశలో, మిగిలిన 25% పుష్పించే దశలో వేయాలి. మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులను విత్తే సమయంలో వేయాలి. నీటి పారుదల లేని పూర్తి మెట్ట పరిస్థితుల్లో నత్రజని మొత్తం విత్తేటప్పుడే వేయవచ్చు, లేదా పైపాటుగా వర్షం/తేమ ఉన్నప్పుడు మాత్రమే వేయాలి. ఎండిన నేలపై పైపాటు ఎరువు వేస్తే వృథా అవుతుంది. భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే పంటకు అవసరమైన గంధకం, కాల్షియం కూడా అందుతాయి. ద్వితీయ, సూక్ష్మ పోషకాలు, నూనె శాతం, గింజ నిండుదనానికి కీలకం గంధకం: నూనెగింజల పంటల్లో నూనె శాతం పెరగటానికి గంధకం తప్పనిసరి. ఎకరాకు 8 కిలోల గంధకం అందేలా 50 కిలోల జిప్సం ఆఖరి దుక్కిలో వేయాలి. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక