వాతావరణాధారిత వ్యవసాయ సలహాలు భారత వాతావరణ విభాగం వారి సమాచారం ప్రకారం నైరుతి రుతుపవనాలు జూన్ 04వ తేదీన కేరళలో ప్రవేశించాయి. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు జూన్ 08వ తేదీన ప్రవేశించి జూన్ 23వ తేదీ వరకు రాష్ట్రమంతటా విస్తరించాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 01.06.2026 నుండి 30.09.2026 వరకు కురిసిన వర్షపాతాన్ని గమనించినట్లయితే సాధారణ వర్షపాతం 740.6 మి. మీ. గాను 615.5 మి.మీ అంటే సాధారణ వర్షపాతం (-17 శాతం) నమోదయింది. రాష్ట్రంలో వానాకాలం పంటకాలానికి 30.09.2026వ తేదీ వరకు సాధారణ విస్తీర్ణంలో (ఎకరాలలో) వరి - 86 శాతం (56,79,969), జొన్న - 103 శాతం (35,437), మొక్కజొన్న - 96 శాతం (5,93,221), పత్తి - 102 శాతం (48,33,112), కంది - 102 శాతం (5,58,177), పెసర - 249 శాతం (1,60,676), మినుములు - 201 శాతం (73,834), సోయాచిక్కుడు - 89 శాతం (3,72,424), వేరుశనగ - 79 శాతం (20,365) సాగు చేశారు. ఈ సంవత్సరం వానాకాలం పంటకాలంలో ఇప్పటి వరకు 95 శాతం మేర పంటలు సాగుచేశారు. ఇందులో ఆహార పంటలు 87 శాతం, పప్పుదినుసులు 123 శాతం, నూనె గింజల పంటలు 89 శాతం సాగుచేశారు. వాతావరణ విభాగం సమాచారం ప్రకారం నైరుతి రుతుపవనాల ద్వారా అక్టోబర్ నెలలో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి. అదేవిధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఈ మాసంలో నమోదుకావచ్చును. వాతావరణాధారిత వ్యవసాయ సలహాలు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో నల్ల రేగడి నేలల్లో నిలువ వుండే తేమను ఉపయోగించుకుంటూ శనగ, కుసుమ పంటలను అక్టోబర్ రెండవ పక్షంలో విత్తుకోవాలి నీటి వసతి గల ప్రాంతాలలో ఆరు తడి పంటలైన మొక్కజొన్న, కంది, జొన్న, వేరుశనగ, ఆవాలు, ఆముదం, పొద్దుతిరుగుడు పంటలను విత్తుకోవాలి. వరిలో ఆకుల కొనలనుండి కింది వైపుకు ఎండినట్లయితే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులుగా గమనించాలి. నివారణకు పొలం నుండి నీటిని తీసివేయాలి, ప్లాంటోమైసిన్ 0.2గ్రా.+ కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రా. లేదా అగ్రిమైసిన్ 0.4గ్రా. + కాపర్ఆక్సి క్లోరైడ్ 3గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో గింజ పాలు పోసుకొనే దశలో మెడవిరుపు తెగులు ఆశించడానికి అనుకూలం. లక్షణాలు తొలిదశలో గమనించినట్లయితే ఎకరానికి ట్రైసైక్లోజోల్ + మ్యాంకోజెబ్ 500 గ్రా. లేదా ఐసోప్రోథియోలేన్ 320 మి. లీ. లేదా కాసుగామైసిన్ 500 మి.లీ. పిచికారీ చేయాలి. ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 25% తేబుకొనజోల్ 50% (75 డబ్ల్యుజి) 80 గ్రా. లేదా పీకాక్సీస్ట్రోబిన్ 6.78% + ట్రైసైక్లోజోల్ 20.33% ఎస్ సి 400 మి.లీ. లేదా అజాక్సిస్ట్రోబిన్ 16.7% + ట్రైసైక్లోజోల్ 33.3% ఎస్ సి 200 మి. లీ లేదా పత్తిలో బ్యాక్టీరియా నల్ల మచ్చ తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు 10 లీటర్ల నీటికి 1 గ్రా. స్ట్రెప్టోసైక్లిన్ లేదా పౌషామైసిన్ లేదా ప్లాంటోమైసిన్, 30 గ్రా. రాగిధాతు సంబంధిత మందులు (కాపర్-ఆక్సి-క్లోరైడ్) మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పత్తిలో గులాబి రంగు పురుగు నివారణకు, పొలంనుండి గుడ్డి పూలను ఏరి నాశనం చేయాలి. 2మి.లీ. క్వినాల్ ఫాస్ లేదా 1.5గ్రా. థయోడికార్బ్ లేదా 2.5 మి.లీ. క్లోరిపైరిఫాస్ లేదా 0.4 గ్రా. ఇమామెక్టిన్ బెంజోయేట్ మందును లీటరు నీటికి కలిపి వారం నుండి 10 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. వాతావరణ పరిస్థితులు కంది పంటలో ఆకుచుట్టు పురుగు ఆశించడానికి అనుకూలం. పురుగు గమనిస్తే, నివారణకు 2.5 మి.లీ. క్లోరిపైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అధిక ఉష్ణోగ్రతల వలన కూరగాయ పంటలలో రసంపీల్చే పురుగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు 0.3 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వంగలో కొమ్మ, కాయతొలిచే పురుగు నివారణకు, పురుగు సోకిన కొమ్మలను తుంచి నాశనం చేయాలి, 2 మి.లీ. ప్రొఫెనోఫాస్ లేదా 0.4 గ్రా. ఇమామెక్టిన్ బెంజోయేట్ మందును ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. టమాటలో పొగాకు లద్దెపురుగు, శనగ పచ్చ పురుగు, సూది పురుగుల నివారణకు - ఉధృతిని గమనించడానికి ఎకరాకు 10 చొప్పున లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి. అజాడిరక్టిన్ (వేపనూనె) 10000 పి.పి.ఎం 2-3 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి 10 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 1.5 మి.లీ. నోవాల్యురాన్ లేదా 0.4 గ్రా. ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా 0.25 మి.లీ. ఫ్లూబెండమైడ్ లేదా 0.3 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వాతావరణ పరిస్థితులు బత్తాయిలో మంగునల్లి ఆశించడానికి అనుకూలం. నివారణకు, 3గ్రా. నీటిలో కరిగే గంధకం 1 మి.లీ. ప్రొపర్ జైట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వాతావరణ పరిస్థితులు మామిడిలో ఆకు గూడు పురుగు ఆశించడానికి అనుకూలం. నివారణకు 2మి.లీ. క్లోర్ పైరిఫాస్ లేదా 1.5గ్రా. ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆధారం: పాడిపంటలు మాసపత్రిక