ఇండోర్ మొక్కలు ఏరిమిత స్థలం, వెలుతురు, ఇంటి వాతావరణంలో పెరగగల సామర్థ్యం ఉన్న మొక్కలను సాధారణంగా ఇండోర్ మొక్కలుగా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో ఇళ్లలో తోటలకు స్థలం తగ్గిపోవడంతో ఇండోర్ గార్డెనింగ్‌కు మంచి ఆదరణ పెరిగింది. కుండీలు, వేలాడే బుట్టలు, టేబుల్, కిటికీల దగ్గర గోడలపై కూడా ఇండోర్ మొక్కలను పెంచవచ్చు. ఇవి ఇంటికి పచ్చదనాన్ని అందించడమే కాకుండా, అలంకరణకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఇండోర్ మొక్కలు ఆధునిక జీవన శైలిలో ముఖ్య భాగంగా మారాయి. మనుషులను ప్రకృతికి దగ్గర చేస్తాయి. తక్కువ స్థలంలో పెంచగలగడం, వివిధ ఆకారాలు, రంగుల్లో లభించడం, అలంకరణకు అనుకూలంగా ఉండటం వంటి లక్షణాల వల్ల వీటికి మంచి ఆదరణ ఉంది. అందం, పచ్చదనం, ప్రకృతితో అనుబంధాన్ని మన రోజువారీ జీవితంలోకి తీసుకువస్తాయి. ఈ మొక్కల ప్రాముఖ్యత ఇంటికి ఇనుమడించే ఇండోర్ మొక్కలు ఇల్లు, కార్యాలయం, ఇతర ప్రదేశాలకు సహజమైన అందాన్ని ఇస్తాయి. పచ్చనిఆకులు, వివిధఆకారాలు, రంగులతో ఉండే మొక్కలను అమర్చుకుంటే సాధారణ గదిని కూడా ఆకర్షణీయంగా మార్చవచ్చు. పచ్చదనం పెంపు: పట్టణ, నగర ప్రాంతాల్లోని ఇళ్ళు, అపార్ట్ మెంట్లలో చెట్లు, తోటలకు స్థలం తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో ఈ రకమైన మొక్కలు ఇంటి లోపలే పచ్చదనాన్ని అందిస్తాయి. చిన్న స్థలంలో కూడా అనేక మొక్కలను పెంచవచ్చు. గాలి నాణ్యతకు తోడ్పాటు : ఈ మొక్కలు కిరణ జన్య సంయోగ క్రియ సమయంలో కార్బన్ డై ఆక్సైడ్‌ను ఉపయోగించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. కొన్ని మొక్కలు గాలిలోని కొన్ని కాలుష్య పదార్థాలను తగ్గించడంలో సహాయపడి గాలి నాణ్యత మెరుగుదలకు తోడ్పడతాయి. మానసిక ప్రశాంతత : పచ్చని మొక్కలను చూడటం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఇంట్లో, కార్యాలయంలో మొక్కలు ఉండటం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. చదువు లేదా పని చేసే ప్రదేశాల్లో కూడా మొక్కలు అందంగా కనిపిస్తాయి. ఒత్తిడిని తగ్గించడంలో దోహదం : మొక్కల సంరక్షణ ఒక మంచి హాబీగా మారుతుంది. వాటికి నీరు పోయడం, ఆకులను శుభ్రం చేయడం, కొత్త ఆకులు రావడాన్ని గమనించడం ఆనందాన్ని ఇస్తుంది. కార్యాలయాల అలంకరణ : ఆఫీస్‌లు, రిసెప్షన్ ప్రాంతాలు, సమావేశ గదులు, ఇతర పని ప్రదేశాల్లో ఈ మొక్కలను అలంకరణకు ఉపయోగిస్తారు. ఇవి కార్యాలయాన్ని సహజంగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. చిన్న స్థలాలకు అనుకూలం : బాల్కనీ, కిటికీ, టేబుల్, షెల్ఫ్, మూల ప్రదేశాల్లో కూడా వీటిని పెంచవచ్చు. అందువల్ల అపార్ట్మెంట్లు చిన్న ఇళ్లకు ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. మనీప్లాంట్ : మనీప్లాంట్ మనదగ్గర చాలా ప్రసిద్ధి చెందిన మొక్క. ఇది తక్కువ నుంచి మధ్యస్థ వెలుతురులో పెరగగలదు. కుండీలో లేదా వేలాడే బుట్టలో పెంచవచ్చు. స్నేక్ ప్లాంట్ : దీని ఆకులు పొడవుగా, నిటారుగా ఉంటాయి. తక్కువ వెలుతురులో కూడా పెరగగలగడం దీని ప్రత్యేకత. బెడ్రూమ్, లివింగ్ రూమ్, ఆఫీస్ ప్రవేశ ద్వారాల అలంకరణకు ఉపయోగిస్తారు. స్పైడర్ ప్లాంట్: స్పైడర్ ప్లాంట్‌కు పొడవైన, సన్నని ఆకులు ఉంటాయి. ఇది వేగంగా పెరుగుతుంది. తల్లి మొక్క నుంచి చిన్న మొక్కలు ఏర్పడటం దీని ప్రత్యేక లక్షణం. వేలాడే బుట్టలు, కిటికీలు, షెల్ఫ్ అలంకరణకు ఉపయోగిస్తారు. పీస్ లిల్లీ : పీస్ లిల్లీ ఆకర్షణీయమైన ఆకులు, తెల్లని పుష్పాల వంటి స్పామ్‌లకు ప్రసిద్ధి. ఇంట్లో అందమైన వాతావరణాన్ని కలిగించడానికి దీనిని ఎక్కువగా లివింగ్ రూమ్, ఆఫీస్, హోటల్, ఇతర ఇండోర్ ప్రదేశాల్లో ఉపయోగిస్తారు. అరెకాపామ్ : అరెకాపామ్ ఒక అందమైన అలంకార మొక్క. దీని పొడవైన, సన్నని ఆకులు ఇంటికి సహజమైన తోట వాతావరణాన్ని ఇస్తాయి. మంచి వెలుతురు ఉన్న ఇండోర్ ప్రదేశాల్లో, పెద్ద గదులు, హోటళ్లు, ఆఫీస్‌ల అలంకరణకు దీనిని పెంచవచ్చు. రబ్బర్ ప్లాంట్ : రబ్బర్ ప్లాంటు పెద్ద, మందమైన, మెరిసే ఆకులు ఉంటాయి. ఇది మంచి వెలుతురు ఉన్న ఇండోర్ ప్రదేశాల్లో బాగా పెరుగుతుంది. లివింగ్ రూమ్, ఆఫీస్, పెద్ద ఇండోర్ ప్రదేశాల అలంకరణకు ఉపయోగిస్తారు. బోస్టన్ ఫెర్న్ : బోస్టన్ ఫెర్క చిన్న చిన్న ఆకులతో కూడిన అందమైన పచ్చని ఫ్రెండ్స్ ఉంటాయి. ఇది తేమ ఉన్న వాతావరణాన్ని ఇష్టపడుతుంది. వేలాడే బుట్టలు, బాల్కనీకి అనుసంధానమైన ఇండోర్ ప్రదేశాలు అలంకరణలో ఉపయోగిస్తారు. డ్రాసీనా : వీటిని ఇల్లు, ఆఫీస్ అలంకరణలో ఉపయోగిస్తారు. కార్యాలయాలు, లివింగ్ రూమ్‌లు ఇతర ఇండోర్ ప్రదేశాలలో పెంచవచ్చు. ఈ మొక్కల సంరక్షణలో ముఖ్య జాగ్రత్తలు ఇండోర్ మొక్కలు ఇంటి లోపల పెరుగుతాయి కాబట్టి వాటికి సరైన సంరక్షణ అవసరం. వెలుతురు : ప్రతి మొక్కకు అవసరమైన వెలుతురు వేర్వేరుగా ఉంటుంది. తక్కువ వెలుతురు అవసరమైన మొక్కలను తక్కువ కాంతి ఉన్న ప్రదేశాల్లో ఉంచవచ్చు. ఎక్కువ వెలుతురు అవసరమైన మొక్కలను కిటికీ దగ్గర ఉంచాలి. నీరు : వీటికి ఎక్కువగా నీరు పోయడం మంచిది కాదు. కుండీలో నీరు నిల్వ ఉంటే వేర్లు కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మట్టి పరిస్థితిని చూసి అవసరమైనప్పుడు మాత్రమే నీరు ఇవ్వాలి. కుండి, డ్రైనేజ్ : కుండి అడుగున నీరు బయటకు వెళ్లే రంధ్రాలు ఉండాలి. మంచి డ్రైనేజ్ ఉన్న కుండీలు మొక్కల ఆరోగ్యకరమైన పెరుగుదలకు సహాయపడతాయి. మట్టి : నీరు నిల్వ ఉండకుండా, గాలి ప్రసరణకు అనుకూలంగా ఉండే తేలికైన మట్టి మిశ్రమాన్ని ఉపయోగించడం మంచిది. ఆకుల శుభ్రత : వీటి ఆకులపై దుమ్ము పేరుకు పోవచ్చు. తడిగుడ్డతో ఆకులను మెల్లగా శుభ్రం చేయడం వల్ల మొక్క అందంగా కనిపిస్తుంది. పురుగులు, వ్యాధులు: ఆకులపై పురుగులు, మచ్చలు లేదా ఇతర సమస్యలు కనిపిస్తే వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. ఆధారం: పాడిపంటలు