రబీ కూరగాయల సాగు టమాటా, మిరప, వంకాయలో నాణ్యమైన దిగుబడికి మెళకువలు తక్కువ విస్తీర్ణంలో, తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయాన్నిచ్చే పంటలు కూరగాయలు. వీటిలో రైతులు ఎక్కువగా సాగు చేసే టమాటా, మిరప, వంగ ముఖ్యమైన పంటలు. ఈ మూడు పంటలూ ఒకే కుటుంబానికి (సొలనేసి) చెందినవి కావటం వల్ల వీటి సాగు పద్ధతులు, ఆశించే చీడపీడలు చాలా. వరకు ఒకేలా ఉంటాయి. రబీ కాలం (అక్టోబర్-ఫిబ్రవరి) ఈ పంటలకు అత్యంత అనుకూలమైనది. చల్లని, పొడి వాతావరణంలో పూత, కాయ బాగా నిలుస్తాయి. కాయలు ఆకర్షణీయమైన రంగు, మంచి రుచి, ఎక్కువ నిల్వ సామర్థ్యంతో వస్తాయి. ఖరీఫ్ తో పోలిస్తే తెగుళ్ల ఉధృతి తక్కువ. అయితే రసం పీల్చే పురుగులు, అవి వ్యాపింపజేసే వైరస్ తెగుళ్లు, కాయతొలుచు పురుగులు రబీలో కూడా తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఆరోగ్యకరమైన నారు, సరైన నాటే సమయం, సమగ్ర పురుగు యాజమాన్యం ఈ మూడింటిపై శ్రద్ధ వహిస్తేనే నాణ్యమైన, పురుగు మందుల అవశేషాలు లేని దిగుబడి, మార్కెట్లో మంచి ధర సాధ్యమవుతాయి. నాణ్యమైన నారు- దిగుబడికి పునాది కూరగాయల సాగులో "నారు బాగుంటే సగం పంట పండినట్లే" అనే మాట అక్షరాలా నిజం. వైరస్ తెగుళ్లు చాలా వరకు నారుమడి దశలోనే రసం పీల్చే పురుగుల ద్వారా మొక్కలకు సోకుతాయి. కాబట్టి నారును రైతులే స్వయంగా జాగ్రత్తగా పెంచుకోవటం గాని, నమ్మకమైన, గుర్తింపు పొందిన నర్సరీల నుండి కొనుగోలు చేయటం గాని చేయాలి. విత్తన ఎంపిక, మోతాదు ప్రాంతానికి అనువైన, వైరస్ తెగుళ్లను తట్టుకునే హైబ్రిడ్ లేదా మేలైన రకాలను ఎంపిక చేసుకోవాలి. ప్యాకెట్‌పై మొలక శాతం, ప్యాకింగ్ తేదీ, గడువు తేదీ, లాట్ నంబర్ చూసి, రశీదు తీసుకుని మాత్రమే విత్తనం కొనాలి. పంట హైబ్రిడ్ రకాలు (ఎకరానికి) సూటి/మేలైన రకాలు (ఎకరానికి) టమాటా 50-60 గ్రాములు 150-200 గ్రాములు మిరప 80-100 గ్రాములు 400-500 గ్రాములు వంకాయ 80-100 గ్రాములు 200-250 గ్రాములు నారు పెంచే పద్ధతులు ఎత్తైన నారుమళ్లు: 1 మీటరు వెడల్పు, 15 సెం.మీ. ఎత్తు, అవసరమైన పొడవుతో మళ్లు చేయాలి. ఒక సెంటు నారుమడికి 100 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు, 1 కిలో వేపపిండి, 50గ్రా, ట్రైకోడెర్మా విరిడి కలపాలి. మళ్లపై 10 సెం.మీ. దూరంలో అడ్డంగా వరుసలు తీసి, విత్తనాన్ని పలుచగా విత్తి, పలుచని ఎరువు/మట్టి పొరతో కప్పాలి. ప్రోట్రేలలో నారు : 98 గుంతలు గల ప్లాస్టిక్ ప్రోట్రేలలో, క్రిమిరహితమైన కోకోపీట్ నింపి, గుంతకు ఒక విత్తనం చొప్పున విత్తాలి. ట్రేలను 3-4 రోజులు ఒకదానిపై ఒకటి పేర్చి పాలిథీన్ కప్పి ఉంచితే మొలకలు త్వరగా వస్తాయి. మొలకెత్తిన వెంటనే ట్రేలను నీడ వల (షేడ్‌నెట్) కింద వరుసగా పరచాలి. నారుమడిలో రక్షణ చర్యలు నేల సౌరీకరణ : నారుమళ్లను తడిపి, 3-4 వారాలు పారదర్శక పాలిథీన్ షీటుతో కప్పి ఉంచితే ఎండ వేడికి నేలలోని తెగులు శిలీంధ్రాలు, కలుపు విత్తనాలు, నులిపురుగులు నశిస్తాయి. విత్తనశుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్ లేదా కాప్టాన్, లేదా 4 గ్రా. ట్రైకోడెర్మా విరిడితో శుద్ధి చేయాలి. మిరపలో రసం పీల్చే పురుగుల నుండి తొలిదశలో రక్షణకు కిలో విత్తనానికి 8గ్రా. ఇమిడాక్లోప్రిడ్ 70 డబ్ల్యు.ఎస్. కలిపి శుద్ధి చేయవచ్చు. క్రిమి నిరోధక వల : నారుమడిని 40-50 మెష్ నైలాన్ వలతో పూర్తిగా కప్పి పెంచితే తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక నారుకు చేరవు. దీని వల్ల టమాటా ఆకుముడత, మిరప జెమిని వైరస్, వంగ వెర్రి తెగులు వంటి వైరస్, ఫైటోప్లాస్మా తెగుళ్లను ప్రారంభంలోనే అడ్డుకోవచ్చు. నారుకుళ్లు తెగులు (డ్యాంపింగ్ ఆఫ్) : మొలకలు మొదళ్ల వద్ద కుళ్లి పడిపోతుంటే, లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి నారుమడిని తడపాలి. నారుమడిలో నీరు ఎక్కువగా పెట్టకూడదు. నారుమడిలో పసుపు రంగు జిగురు అట్టలు పెట్టి రసం పీల్చే పురుగుల ఉనికిని గమనిస్తూ ఉండాలి. వైరస్ లక్షణాలు ఉన్న మొక్కలను వెంటనే పీకి నాశనం చేయాలి. నారు గట్టిపరచటం: నాటటానికి 7-10 రోజుల ముందు నుండి నీటి తడులు క్రమంగా తగ్గించి, నీడ వల తొలగించి ఎండకు అలవాటు చేయాలి. దీని వల్ల నారు గట్టిపడ్ పొలంలో నాటిన తర్వాత త్వరగా నిలదొక్కుకుంటుంది. మంచి నారు : కాండం లావుగా, దృఢంగా ఉండాలి ఆకులు ముదురు పచ్చగా, ఏకరీతిగా ఉండాలి. వేర్లు తెల్లగా, ఎక్కువ పీచు వేర్లతో మట్టి ముద్దను పట్టి ఉండాలి; అన్ని మొక్కలు ఒకే ఎత్తులో ఉండాలి. తిరస్కరించవలసిన నారు: ఆకులు ముడుచుకుని, పసుపు- పచ్చ మచ్చలు (మొజాయిక్) ఉన్నవి, మరీ పొడవుగా, సన్నగా, లేతగా సాగిన నారు (నీడలో ఎక్కువ రోజులు పెరిగినది) వేర్లు గోధుమ రంగులో కుళ్లినవి. వేర్లపై బుడిపెలు (నులిపురుగులు) ఉన్నవి ముదిరిపోయి పూతకు వచ్చిన నారును నాటుటకు ఉపయోగించరాదు. నర్సరీ నుండి కొనుగోలు చేసేటప్పుడు ఆ నర్సరీ క్రిమి నిరోధక వల కింద నారు పెంచుతుందో లేదో తప్పనిసరిగా చూడాలి. వలలు లేని చోట పెరిగిన నారు ద్వారా వైరస్ పొలమంతా వ్యాపించే ప్రమాదం ఉంది. నాటే సమయం, నాటే పద్ధతి : రబీలో నాటే సమయం సరిగా ఉంటే పూత, కాయ దశలు డిసెంబర్-జనవరి చల్లని వాతావరణంలో వచ్చి నాణ్యమైన దిగుబడి వస్తుంది. ఆలస్యంగా నాటితే కాయ దశ ఫిబ్రవరి- మార్చి ఎండలతో కలిసి పూత రాలటం, కాయ పగలటం, రసం పీల్చే పురుగుల ఉధృతి పెరుగుతాయి. వేరు శుద్ధి: నాటే ముందు నారు వేర్లను లీటరు నీటికి 10గ్రా. సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ లేదా 1 గ్రా. కార్బెండజిమ్ ద్రావణంలో 20-30 నిమిషాల పాటు ఉంచి నాటాలి. రసం పీల్చే పురుగుల నుండి రక్షణకు లీటరు నీటికి 0.5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ కూడా కలపవచ్చు.ఆధారం : పాడిపంటలు మాసపత్రిక