సమీకృత వ్యవసాయంలో విజయుడు అరటిలో అంతర పంటలుగా కూరగాయల సాగు మేకల పెంపకం, వర్మి కంపోస్టు తయారీతో అదనపు ఆదాయం వర్మి కంపోస్టు తయారీ. పంటల సాగు ఖర్చు తగ్గాలి మంచి దిగుబడి రావాలి కుటుంబ జీవన పరిస్థితులు మెరుగుపడాలి. ఆర్థికంగా ఏ రైతుకైనా ఇంతకన్నా కావాల్సిందేముంటుంది. స్థిరపడాలి. సమీకృత వ్యవసాయ విధానం లేదా సమ్మిళిత వ్యవసాయ పద్ధతిలో ఇవి సాధ్యమే. పొలం ఎంతన్నది కాదు. ఏం పండిస్తున్నాం. ఎంత పెట్టుబడి పెడుతున్నాం. ఎంత ఆదాయం పొందుతున్నామన్నదే ముఖ్యం. సాగు చేసిన ఒక్క పంట చేతికి అందకుంటే పరిస్థితి ఏంటి అన్న కోణంలో ఆలోచిస్తే అలాంటి పరిస్థితిలో ఆదుకునేవి అంతర పంటలు జీవాల పెంపకం వర్మి కంపోస్టు, సైలేజ్ తయారీ ఇవన్నీ కూడా సమయానుకూల ఆదాయం ఇచ్చే వనరులే. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఎకరంన్నర పొలంలో వ్యవసాయంపై మక్కువతో విజయకుమార్ నాయుడు బిందు సేద్య పద్ధతిలో గ్రాండ్-9 రకం అరటి సాగు చేస్తున్నారు, అరటి మొక్కల మధ్య ఖాళీ స్థలంలో అలసందలు, గోరుచిక్కుడు వంటి కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు. అరటి చేతికి వచ్చేలోపు అంతర పంటలుగా సాగు చేస్తున్న కూరగాయల వల్ల కుటుంబ జీవనానికి, ఆదాయానికి వెదుక్కోవాల్సిన అవసరం రాలేదు. అంతేకాకుండా పది మేకల పెంపకం వల్ల అదనపు రాబడి వస్తోంది.. వర్మికంపోస్టు తయారు చేస్తున్నారు. దీని వల్ల ఆయన ఆదాయానికి డోకా లేదు. అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన రైతు విజయకుమార్ నాయడు విజయ గాథే ఇది. ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు వర్షాధార ప్రాంత అభివృద్ధి (ఆర్ఎడి) పథకం కింద ఇస్తున్న సలహాలు, ప్రోత్సాహం, మార్గదర్శకత్వం ఆ రైతును విజయపథంలో నడిపిస్తున్నాయి. అరటి, అంతర పంటల సాగు, వర్మి కంపోస్టు, సైలేజ్ తయారీ గురించి వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన శిక్షణ తరగతులకు హాజరయ్యారు విజయకుమార్ నాయుడు. గ్రాండ్-9 అరటి మొక్కలు నిర్ణీత దూరం పాటించి నాటారు. బిందు సేద్య పద్ధతితో మేలైన నీటి యాజమాన్యం సాధ్యమైంది. సిఫార్సు మేరకు పంటకు అవసరమైన ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలను వర్మి కంపోస్టు తయారీతో సమకూర్చుకుంటున్నారు. మేకల పెంపకం పది మేకలను పసిపాపల్లా పెంచుకుంటున్నారు. వాటికి సకాలంలో నట్టల నివారణ టీకాలు వేయించారు. వర్మి కంపోస్టు తయారీ పంట వ్యర్ధాలతో బెడ్లు తయారు చేసి మేకల విసర్జితాలతో సేంద్రియ పద్ధతిలో నాణ్యమైన వర్మి కంపోస్టు తయారు చేస్తున్నారు. ఇలా తయారైన ఎరువును అరటి, కూరగాయ పంటలకు వేయడం వల్ల భూసారం పెరిగి నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయి. సైలేజ్ తయారీ చాప్ కట్టర్ యంత్రం ద్వారా పశువుల మేతను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పశువులకు అందించడంతో పాల ఉత్పత్తి పెరిగింది. పచ్చిగడ్డి దొరకని వేసవి కాలంలో పాడి పశువులకు పౌష్టికాహారాన్ని అందించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతోంది. ఈ పద్ధతులు అవలంబించడం వల్ల అరటి గెలల్లో హస్తాలు పెరిగి మార్కెట్లో మంచి ధర లభించిందని రైతు విజయ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. అరటి దిగుబడి వచ్చే లోపు ఆ మొక్కల మధ్య భూమిని సద్వినియోగం చేసుకుని అలసందలు, గోరుచిక్కుడు సాగు చేయడం వల్ల కుటుంబానికి రూ.28 వేల అదనపు ఆదాయం లభించింది. వర్మి కంపోస్టు వాడకం వల్ల పంట పెట్టుబడి వ్యయం దాదాపు 40 శాతం ఆదా కావడమే కాక, ఆ మేరకు రసాయన ఎరువుల వినియోగం కూడా తగ్గింది. ఆర్థిక సహాయం సమగ్ర వ్యవసాయ విధానం (Inte-grated Farming System - IFS)తో పాటు అనుబంధంగా సైలేజ్ యూనిట్లు, వర్మీ కంపోస్ట్ యూనిట్ల నిర్వహణ ద్వారా బహుముఖ ఆదాయాన్ని విధానాన్ని అనుసరించినందుకు గాను, RAD పథకం కింద అతనికి రూ. 30,000 ఆర్థిక సహాయం అందించబడింది. అరటి, అందులో అంతర పంటలు, జీవాల పెంపకం, వర్మ కంపోస్టు, సైలేజ్ తయారీ వల్ల ఒకటిన్నర ఎకరాల సన్నకారు రైతు అయిన విజయకుమార్ నాయుడు ఆర్ధిక స్థితి గణనీయంగా మెరుగుపడింది. నేటి పరిస్థితుల్లో సమీకృత వ్యవసాయ పద్ధతి ఇలాంటి చిన్న, సన్నకారు రైతులకు మార్గదర్శకం ఆచరణీయం. ఆధారం: పాడిపంటలు