ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు, ఉష్ణోగ్రతల్లో అసాధారణ పెరుగుదల, భూగర్భ జలమట్టం తగ్గుదల వంటి సమస్యలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. అరటి పంటకు నీటి అవసరం ఎక్కువగా ఉండటం వల్ల, ఇలాంటి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా, సమర్థవంతంగా వినియోగించుకోవడం చాలా ముఖ్యం. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోతే గెలల సైజు తగ్గడం, పండ్ల నాణ్యత దెబ్బతినడం, దిగుబడి గణనీయంగా పడిపోవడం వంటి నష్టాలు తప్పవు. ఈ నేపథ్యంలో బిందు సేద్యం, మల్చింగ్, ఫర్టిగేషన్ పద్ధతులను సమన్వయంతో అమలు చేస్తే తక్కువ నీటితోనే నాణ్యమైన దిగుబడిని సాధించవచ్చు. బిందు సేద్యం (డ్రిప్) డ్రిప్ పద్ధతిలో మొక్క వేరు ప్రాంతానికి నేరుగా, నెమ్మదిగా నీరు అందించడం వల్ల నీటి ఆవిరి నష్టం, పక్కకు పారే నష్టం గణనీయంగా తగ్గుతుంది. సాధారణ కాలువ పద్ధతితో పోలిస్తే డ్రిప్ ద్వారా 40-50% వరకు నీటిని ఆదా చేయవచ్చు, అదే సమయంలో దిగుబడిని 20-25% వరకు పెంచుకోవచ్చు. ముఖ్యమైన సూచనలు 4-8 లీటర్ల/గంటకు సామర్థ్యం గల ఇన్లైన్ డ్రిప్పర్లను మొక్కకు ఒకటి లేదా రెండు వేరు వ్యాప్తికి అనుగుణంగా అమర్చాలి. ఎల్ నినో పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు, రోజుకు ఒకేసారి కాకుండా ఉదయం, సాయంత్రం రెండు విడతలుగా సరిపడా నీరు ఇవ్వడం వల్ల భూమిలో తేమ స్థిరంగా ఉంటుంది. వారానికి ఒకసారి డ్రిప్పర్లు, ఫిల్టర్లను శుభ్రం చేసుకోవాలి మూసుకుపోయిన డ్రిప్పర్ల వల్ల అసమాన నీటి పంపిణీ జరిగి మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉంది. నేల తేమను ఎప్పటికప్పుడు టెన్సియో మీటర్ల ద్వారా లేదా వేలితో పరీక్షించి, అవసరాన్ని బట్టి మాత్రమే నీరు ఇవ్వాలి. నీటిని అతిగా ఇవ్వడం వల్ల దుంపకుళ్ళు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మల్చింగ్ మల్చింగ్ అంటే మొక్క మొదలు చుట్టూ నేలను ప్లాస్టిక్ షీట్తో గానీ, ఎండిన వరిగడ్డి, చెరకు పిప్పి, అరటి ఆకులు వంటి సేంద్రియ పదార్థాలతోగానీ కప్పడం. దీని వల్ల నేల నుంచి తేమ ఆవిరి కావడం గణనీయంగా తగ్గి, ఎల్నినో వంటి వర్షాభావ పరిస్థితుల్లో నీటి పొదుపుకు ఎంతో దోహదపడుతుంది. వీడ్ మాట్ (Weed mat) తో మల్చింగ్ చేసుకోవడం అత్యుత్తమ విధానంగా ప్రయోగాలలో నిరూపించబడినది. ప్రయోజనాలు నేలలో తేమ ఎక్కువకాలం నిల్వ ఉండటం వల్ల నీటి తడుల మధ్య వ్యవధి పెంచుకోవచ్చు, తద్వారా 25– 30% వరకు నీటి వాడకం తగ్గుతుంది. కలుపు మొక్కల పెరుగుదల అదుపులో ఉండి, పోషకాల కోసం పోటీ తగ్గుతుంది. నేల ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండి వేరు వ్యవస్థ ఆరోగ్యంగా అభివృద్ధి చెందుతుంది. సేంద్రియ మల్చింగ్ కుళ్ళిపోయే కొద్దీ నేలలో సేంద్రియ కర్బనం పెరిగి. నేల భౌతిక లక్షణాలు మెరుగవుతాయి. ముఖ్య సూచనలు తెలుపు రంగు ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ (100 మైక్రాన్లు)ను మడుల మీద పరచి, డ్రిప్ పైప్ లైన్ దాని కింద అమర్చుకోవాలి. సేంద్రియ మల్చింగ్ చేసేటప్పుడు మొక్క మొదలుకు 8-10 సెం.మీ. దూరం వదిలి 10-15 సెం.మీ. మందంలో పరచాలి, తద్వారా కాండంకుళ్ళు వ్యాధులు రాకుండా ఉంటాయి. ప్రతి 3-4 నెలలకోసారి సేంద్రియ మల్చింగ్ పరిశీలించి, అవసరమైతే మళ్లీ వేసుకోవాలి. వీడ్ మాట్ వాడినప్పుడు సాంప్రదాయ పద్దతిలో (నీటి పారుదల), నీటిని అందించడానికి అవకాశం ఉంటుంది. ఫర్టిగేషన్ డ్రిప్ నీటి పారుదల ద్వారానే ఎరువులను కరిగించి మొక్క వేరు మండలానికి నేరుగా అందించే పద్ధతినే ఫర్టిగేషన్ అంటారు. ఎల్ నినో పరిస్థితుల్లో పరిమిత నీటి లభ్యత దృష్ట్యా, ఫర్టిగేషన్ ద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యం 85-90% వరకు పెరుగుతుంది, సాధారణ పద్ధతిలో 40-50% మాత్రమే ఉంటుంది. ప్రయోజనాలు మొక్కకు కావలసిన 200:50:200 గ్రాముల నత్రజని, భాస్వరం, పొటాష్లను నీటిలో కరిగే ఎరువులు 19:19:19, MOP, యూరియా, నైట్రేట్ల రూపంలో చిన్న చిన్న మోతాదులుగా, తరచుగా అందించడం వల్ల మొక్క తక్షణమే గ్రహిస్తుంది. నెలకు ఒకేసారి ఎక్కువ మోతాదు ఇవ్వడం కంటే వారానికి 2-3 సార్లు చిన్న మోతాదుల్లో ఫర్టిగేషన్ చేయడం, మేలు. ఫర్టిగేషన్కు ముందు. తర్వాత కొద్దిసేపు మంచినీటిని మాత్రమే డ్రిప్ ద్వారా పంపి లైన్లలో ఎరువు అవశేషాలు నిలవకుండా చూసుకోవాలి. గెలల నాణ్యత మెరుగుదల పైన తెలిపిన మూడు పద్ధతులను సమన్వయంతో పాటించడం వల్ల నీటి ఒత్తిడి తగ్గి, గెలల నాణ్యతపై సానుకూల ప్రభావం కనిపిస్తుంది. ఎల్నినో కారణంగా వచ్చే అధిక ఉష్ణోగ్రతలు, తేమ లోపం వల్ల గెలలు చిన్నవిగా మారడం, కాయలు వంకరగా తయారవడం, తొక్కరంగు మారడం వంటి సమస్యలు సాధారణం. వీటిని అధిగమిం చడానికి ఈ కింది శాస్త్రీయ సూచనలు ఉపయోగపడతాయి. నీటి ఎద్దడిని తట్టుకొనే ఇతర యాజమాన్య పద్ధతులు గెల వేసిన వెంటనే మగపువ్వు గెలను తొలగించడం వల్ల మొక్క శక్తి కాయల పెరుగుదలకు మళ్లుతుంది. గెలకు 17 GSM తెలుపు రంగు నైట్రో సెల్యూలోజ్ కవర్లు తొడగడం వల్ల ఎండ, గాలి, దుమ్ము తాకిడిని కాయలు తట్టుకుని, తొక్క నునుపుగా, రంగు ఏకరీతిగా ఉంటుంది. గెల బరువును తట్టుకునేలా తగిన మద్దతు ఇవ్వాలి, ముఖ్యంగా వేసవి గాలుల వల్ల మొక్కలు ఒరిగిపోకుండా జాగ్రత్త వహించాలి. గెల పెరుగుదల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి తడులు ఆపకూడదు. ఈ దశలో నీటి కొరత గెల సైజుపై అత్యంత ప్రతికూల ప్రభావం చూపుతుంది. కోతకు 8-10 వారాల ముందు నుంచి తడి వ్యవధిని కొద్దిగా తగ్గించి, తర్వాత సాధారణ స్థితికి తీసుకురావడం వల్ల పండు తీపి పెరుగుతుంది. ఎప్పటికప్పుడు ఎండిన ఆకులు, పిలకలు తొలగించుకొని మొక్క మొదలులో మల్చింగ్ చేసుకోవాలి. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక