రబీ అపరాలు - సుస్ధిర దిగుబడులకు అనువైన రకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండించే అపరాలలో ప్రధానమైనవి మినుము, పెసర. ఈ పంటలను తొలకరి, రబి, వేసవి కాలాలలో ఏక పంటగానే కాకుండా ప్రత్తి, కంది, పండ్ల తోటలలో అంతర పంటలుగా సాగుచేయటం జరుగుతుంది. తక్కువ కాల పరిమితి రకాలు అందుబాటులో వుండటం వలన, వివిధ పంటలతో పంట మార్పిడి చేయడం జరుగుతుంది. భూమికి సేంద్రియ పదార్ధం అందించడంతోపాటు, నత్రజనిని స్థిరీకరించి నేలసారం పెంచడంలో, స్వల్ప కాలంలో తక్కువ నీటి వినియోగంతో సుస్ధిర దిగుబడులతో ఆహార భద్రత కల్పించడంలో, ధాన్యపు పంటల సరళిలో పంట మార్పిడితో అధిక ఆదాయాన్ని ఇవ్వడంలో పెసర, మినుము పాత్ర చాలా ప్రముఖమైనదిగా చెప్పవచ్చు. మినుము, పెసర పంటలను వరి మాగాణులలో రబీ కాలంలో కోతకు రెండు మూడు రోజుల ముందు జీరో టిల్లేజ్ విధానములో విత్తి, ఎలాంటి ఎరువులు వేయకుండా, అందుబాటులో ఉన్న నేలలోని తేమతో సాగుచేయడం మన రాష్ట్ర ప్రత్యేకత. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం మరియు శ్రీకాకుళం జిల్లాలలో మినుము పైరును, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం మరియు అనంతపురం జిల్లాలలో పెసర పైరును ఎక్కువగా సాగు చేస్తూ, మినుము ఎకరాకు సరాసరి 378 కిలోలు మరియు పెసర 330 కిలోలు దిగుబడులు పొందడం జరుగుతుంది. ఈ పంటల సాగులో ఉన్న సమస్యలను అవగాహన చేసుకొని, వాటిని అధిగమించినట్టైతే పంటల ఉత్పాదకతను మరియు ఉత్పత్తిని ఇతోధికంగా పెంచుకొనే ఆవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. పెసరలో అనువైన రకాలు ఎల్.జి.జి 460 : కాయలు గుత్తులు గుత్తులుగా పై భాగంలో ఏర్పడడం వలన కోయడానికి సులువుగా వుంటుంది, ఒకేసారి కోతకి వస్తుంది. పల్లాకు, మొవ్వుకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకొంటుంది. మెట్ట వరిమాగాణులకు అనువైనది. పంట కాలము 65-70 రోజులు. దిగుబడి ఎకరాకు 6–6.5 క్వింటాళ్లు టి.యం 96–2 : అధిక తేమను, బూడిద తెగులును తట్టుకొంటుంది. గింజలు లావుగా మెరుస్తుంటాయి వరిమాగాణు లకు అనువైనది. పంటకాలము 60-65 రోజులు. దిగుబడి ఎకరాకు 5.5-6.0 క్వింటాళ్లు. డబ్ల్యూ.జి.జి 42 : ఈ రకము ప్రాంతీయ వ్యవసాయపరిశోధనా స్థానం, వరంగల్ నుండి విడుదల చేయబడినది. అన్ని కాలాలకు అనువైన పల్లాకు తెగులును, తట్టుకొనే స్వల్పకాలిక రకము. కాయలు పొడవుగా వుండి గింజలు లావుగా వుంటాయి. కాయలు పై భాగాన ఏర్పడి పంట ఒకేసారి కోతకు వస్తుంది. కాలపరి మితి 55-60 రోజులు. దిగుబడి ఎకరాకు 4-5 క్వింటాళ్లు. ఐ.పి.యం 2-14 : దక్షిణ భారత దేశంలో సాగుకు విడుదల చేయబడిన రకం. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. గింజ మధ్యస్థ లావుగా ఉండి, మెరుస్తూ ఉంటుంది. కాలపరిమితి 60-65 రోజులు. దిగుబడి ఎకరాకు 5 5.5 క్వింటాళ్లు. ఎల్.జి.జి 607 : కాలపరిమితి 60-65 రోజులు, అన్ని కాలాలకు అనువైనది. పల్లాకు తెగులును తట్టుకునే రకం. వరి మాగాణులకు కూడా అనువైనది. ఎకరాకు 6-7 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఎల్.జి.జి 630 : అన్ని కాలాలకు అనువైనది. పంట కాలం 65-70 రోజులు. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. ఎకరాకు 6.5-7 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఎల్.జి.జి 574 : రబీ కాలానికి అనువైన పల్లాకు తెగులును తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకం. కాయలు గుత్తులు గుత్తులుగా పై భాగంలో ఏర్పడి పంట ఒకేసారి కోతకు వస్తుంది. గింజలు మధ్యస్థ పరిమాణం కలిగి మెరుస్తుంటాయి. పంట కాలము 65-70 రోజులు, దిగుబడి ఎకరాకు 5.5-6.5 క్వింటాళ్లు. ఎల్.జి.జి 600 : ఈ వంగడం దక్షిణ భారతదేశంలో రబీ సాగుకు అనుకూలమైన రకము. కాల పరిమితి 70-75 రోజులు. రబీకి అనువైన పల్లాకు తెగులును తట్టుకొనే అధిక దిగుబడినిచ్చే రకం. కాయలు గుత్తులు గుత్తులుగా పై భాగంలో ఏర్పడి ఒకేసారి కోతకు వస్తాయి. గింజలు మధ్యస్థ పరిమాణం కలిగి మెరుస్తుంటాయి. పంట కాలము 65-70 రోజులు, దిగుబడి ఎకరాకు 5.5-6.5 క్వింటాళ్లు. ఎల్.జి.జి 610 : ఈ వంగడం దక్షిణ భారతదేశంలో రబీ కాలానికి సాగుకు అనుకూలమైన రకము, కాల పరిమితి 70-75 రోజులు, పల్లాకు తెగులును తట్టుకుంటుంది. రబీ కాలానికి అనువైన పల్లాకు తెగులును తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకం. కాయలు గుత్తులు గుత్తులుగా పై భాగంలో వుండి ఒకేసారి కోతకు వస్తాయి. గింజలు మధ్యస్థ పరిమాణం కలిగి మెరుస్తుంటాయి. పంట కాలము 65-70 రోజులు, దిగుబడి ఎకరాకు 5.5-6.5 క్వింటాళ్లు. మినుములో అనువైన రకాలు రబీలో మెట్ట ప్రాంతాలకు అనువైన రకాలు: ఎల్.బి.జి 884, ఎల్.బి.జి 904, టి.బి.జి 129, ఎల్.బి.జి 932, జి.బి.జి 1, టి.బి.జి 104, ఎల్.బి.జి 787, ఎల్.బి.జి 752, ఎల్.బి.జి 685, ఎల్.బి.జి 645, ఎల్.బి.జి 709, ఎల్.బి.జి 20, పి.యు 31. వరిమాగాణులకు అనువైన రకాలు: ఎల్.బి.జి 932 , ఎల్.బి.జి 884, ఎల్.బి.జి 904, ఎల్.బి.జి 752, ఎల్.బి.జి 787, ఎల్.బి.జి 648, ఎల్.బి.జి 645, ఎల్.బి.జి. 685, ఎల్.బి.జి. 709, జి.బి.జి.1, టి.బి.జి 104, పల్లాకు తెగులును తట్టుకొనే రకాలు: ఎల్.బి.జి. 884, ఎల్.బి.జి. 904, ఎల్.బి.జి. 932, జి.బి.జి. 1, టి.బి.జి 104, టి.బి.జి 129, పి. యు31. ముఖ్యమైన మినుము రకాల లక్షణాలు ఎల్.బి.జి 884 : పల్లాకు తెగులును తట్టుకొని అన్ని కాలాల్లో సాగుకు అనువైన రకము, కాయలపై నూగు కలిగి, గింజలు మధ్యస్థ లావుగా వుండి మెరుస్తుంటాయి. పంట కాలము 80-85 రోజులు కలిగి అధిక దిగుబడి నిచ్చే పాలిష్ రకము. దిగుబడి ఎకరాకు 8-9 క్వింటాళ్ళు, ఎల్.బి.జి 904: పంటకాలము 85-90 రోజులు, పల్లాకు తెగులును బాగా తట్టుకొని, కొంతవరకు తలమాడు తెగులును కూడా తట్టుకొనే అన్ని కాలాలకు అనువైన పాలిష్ రకము, గింజలు మద్యస్థ లావు కలిగి, కాయలపై నూగు కలిగి వుండును. దిగుబడి ఎకరాకు 9-10 క్వింటాళ్ళు. ఎల్.బి.జి 932 : అన్ని కాలాలకు అనువైన పల్లాకు తెగులును తట్టుకొనే పాలిష్ రకము, కాయలపై నూగు వుండి, గింజలు మద్యస్థ లావు కలిగి అధిక దిగుబడినిచ్చే రకము. పంటకాలము 85-90 రోజులు. దిగుబడి ఎకరాకు 9-10 క్వింటాళ్ళు. టి.బి.జి. 104 : అన్ని కాలాలకు అనువైన పల్లాకు తెగులును తట్టుకొనే పాలిష్ రకం. కాయలపై నూగు వుంటుంది. పంట కాలము 70-75 రోజులు. దిగుబడి ఎకరాకు 6.5-7 క్వింటాళ్ళు. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక