రబీ శనగ పెట్టుబడి ఆదా దిగుబడి పెంపు ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు, అనంతపురం, కడప, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాల్లో శనగ ముఖ్యమైన రబీ పంట. ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతాంగం రబీ సీజను వైపు ఆశాజనకంగా చూస్తున్నారు. నూతన వంగడాలు మరియు సరైన యాజమాన్య పద్ధతులపై అవగాహన కలిగి సిఫారసు చేసిన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే, సాగు ఖర్చు తగ్గించుకొని మేలైన దిగుబడులు సాధించవచ్చు. పండిన పంటకు మంచి గిట్టుబాటు ధర రావాలన్నా, మార్కెట్ హెచ్చు తగ్గులను తట్టుకోవాలన్నా మార్కెట్ సరళిని గమనించి, ధరలలో వ్యత్యాసాన్ని బేరీజు వేసుకుని దేశవాళీ మరియు కాబూలీ రకాలను సాగు చేసుకోవాలి. విత్తే సమయం రబీ సీజన్లో అక్టోబర్ రెండవ పక్షము నుండి నవంబర్ మొదటి పక్షము వరకు శనగ విత్తుకోవడానికి అనుకూలము, ఆలస్యంగా విత్తితే పంట చివరి దశలో బెట్టకు గురవడం, అధిక ఉష్ణోగ్రతలు వల్ల గింజ సరిగా ఏర్పడక పడకపోవడం వలన దిగుబడులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. విత్తే విధానం వర్షాధార పంటల్లో చ.మీ.కు 33 మొక్కలు, వరుసల మధ్య 30 సెం.మీ., వరుసలో మొక్కల మధ్య 10 సెం.మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి. నీటి వసతి ఉన్నపుడు లావు గింజ కాబూలీ రకాలను ఎంచుకున్నప్పుడు వరుసల మధ్య 45-60 సెం.మీ. దూరం పాటించాలి.యాంత్రీకరణకు అనువైన ధీర రకమును 30×7.5 సెం.మీ. లేదా 22.5×10 సెం.మీ. దూరంలో, చ.మీ. కు 44 మొక్కలు ఉండేలా విత్తుకోవాలి. విత్తన శుద్ధి కిలో విత్తనానికి 5-10గ్రా. ట్రైకోడెర్మా విరిడీ లేదా 3 గ్రా. థైరమ్ లేదా కాష్టాన్ లేదా 2.5 గ్రా. కార్బండిజం లేదా 1-1.5గ్రా విటావాక్స్ పవర్ లేదా 1.5 గ్రా. టెబ్యుకొనజోల్తో విత్తనశుద్ధి చేయాలి. విత్తనానికి ట్రైకోడెర్మావిరిడి పొడి మందును 8-10 గ్రా. కలిపి విత్తుకోవడం వలన శిలీంద్రం భూమిలో బాగా వ్యాప్తి చెంది ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగులు మరియు మొదలు కుళ్ళు తెగుళ్ళ బారి నుండి పంటకు రక్షణ కలుగుతుంది. పోషక యాజమాన్యం భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా నేల స్వభావాన్ని బట్టి, నేలలోని పోషకాల లభ్యతను అనుసరించి ఎరువులు వేసుకోవాలి. సేంద్రీయ ఎరువులతో ట్రైకోడెర్మా విరిడి కలిపి వేసుకోవడం వలన పంటకు తెగుళ్ళ నుండి కూడా రక్షణ కలుగుతుంది.ఎకరాకు 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ లేదా 50 కిలోల డి.ఎ.పి. వేయడం ద్వారా సిఫార్సు చేసిన నత్రజని, భాస్వరం పోషకాలను అందించవచ్చు. సూక్ష్మ పోషకాలైన గంధకం, జింక్, ఇనుము, మాలిబ్డినం కూడా శనగ దిగుబడి పెంచడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. సిఫార్సు మేరకు ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్, నేలలో గంధకము ( సల్ఫర్ ) నిల్వలు 8 పి.పి.ఎమ్. కంటే తక్కువగా ఉ న్నప్పుడు ఎకరాకు 8-10 కిలోల నీటిలో కరిగే గంధకాన్ని విత్తే ముందు వేసుకోవాలి లేదా గంధకాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కూడా అందించవచ్చు. పంట బెట్టకు గురైనప్పుడు లీటరు నీటికి 10 గ్రా. యూరియా చొప్పున 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. నీటి యాజమాన్యం సాధారణంగా శనగను వర్షాధారంగా సాగు చేస్తారు. నీటి వసతి ఉంటే పూతకు ముందు, విత్తిన (30-35 రోజులకు) ఒకసారి, గింజ కట్టే దశలో విత్తిన (55-60 రోజులకు) మరొకసారి నీటి తడులిస్తే మంచి దిగుబడులు వస్తాయి. కలుపు యాజమాన్యం విత్తిన 24 గంటలలోపు ఎకరాకు పెండిమిథాలిన్ 30% ఈసి 1-1.2 లీటర్లు చొప్పున. పిచికారి చేస్తే కలుపును వంట తొలిదశలోనే సమర్థవంతంగా నివారించవచ్చు. పైరు విత్తిన 30 రోజుల వరకు పొలంలో కలుపు లేకుండా ఒకటి రెండు సార్లు అంతర కృషి చేసుకోవాలి. పురుగుల యాజమాన్యం రబ్బరు పురుగు రబ్బరు పురుగు విత్తనం మొలకెత్తినప్పటి నుంచి బాగా ఎదిగే దశ వరకు ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ పురుగులు మొక్క చివరి లేత ఆకుల పత్రహరి తాన్ని గోకి తిని నష్టపరుస్తాయి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు మొక్కలలోని ఆకులన్నీ తెల్లగా మారి ఎండిపోతాయి. రబ్బరు పురుగు నివారణకు ఎకరాకు ఇండొక్సాకార్బ్ 200 మి.లీ. (లేదా) స్పైనోశాడ్ 70 మి.లీ. లేదా థయోడికార్బ్ 300 గ్రా. లేదా ఎసిఫేట్ 200 గ్రా. చొప్పున పిచికారి చేయాలి. శనగపచ్చ పురుగు శనగ పైరులో దాదాపు 20-30 శాతం మేర దిగుబడులు తగ్గడానికి ఈ పురుగు కారణమవుతుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వేసవి కాలంలో లోతు దుక్కులు చేసుకోవాలి, అంతర పంటగా ఆవాలు లేదా ధనియాలు 8:2 నిష్పత్తిలో సాగు చేసుకోవాలి. ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు, 4-6 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. జీవ నియంత్రణలో భాగంగా 400గ్రా. బి.టి. ద్రావణాన్ని లేదా ఎన్.పి.వి. ద్రావణంను కాని లేదా 5 శాతం వేప గింజల కషాయమును 200 లీ. నీటితో కలిపి పిచికారి చేయాలి. చివరిగా క్రిమి సంహారక మందులను ఎకరాకు ఎసిఫేట్ 300 గ్రా. లేదా రైనాక్సీఫిర్ 40 మి.లీ. లేదా ఇండొక్సాకార్బ్ 200 మి.లీ. లేదా స్పైనోశాడ్ 70మి.లీ. చొప్పున పిచికారి చేయాలి. పూత, పిందె దశల్లో పై మందులు మార్చి మార్చి పిచికారి చేయడం ద్వారా పురుగును సమర్ధవంతంగా నివారించడంతో పాటు సాగు ఖర్చును తగ్గించుకోవచ్చు. సమగ్ర సస్యరక్షణ చర్యలలో భాగంగా తెగుళ్ళను తట్టుకొనే రకాలను ఎంపిక చేసుకోవటం, సిఫార్సు చేసిన శిలీంధ్ర నాశినితో విత్తనశుద్ధి చేయడం, పురుగుల ఉదృతిపై నిఘా ఉంచి అవసరం మేరకు మాత్రమే కీటక నాశినులు వాడడం ద్వారా సాగు ఖర్చును నియంత్రించుకోవడంతో పాటు మేలైన దిగుబడులు పొందవచ్చు. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక , కృషి విజ్ఞాన కేంద్రం, గరికపాడు ఎన్.టి.ఆర్. జిల్లా.