నీరు వ్యవసాయానికి జీవనాడి. కానీ మారిన వాతావరణ పరిస్థితుల్లో నేడు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి, వర్షాలు అనిశ్చితంగా మారాయి. దేశంలో వాడుతున్న మొత్తం నీటిలో దాదాపు 80% పైగా వ్యవసాయానికే వినియోగమవుతోంది. అయినప్పటికీ, సరైన యాజమాన్య పద్ధతులు లేకపోవడం వల్ల ఈ నీటిలో మూడో వంతు కూడా ఉత్పాదకతగా మారడం లేదు. ఈ నేపథ్యంలో, నీటిని పొదుపుగా వాడే ఆధునిక సాంకేతికతలను రైతులు అలవాటు చేసుకోవడమే భవిష్యత్తు వ్యవసాయానికి, ఆహార భద్రతకు ఏకైక మార్గం. నీటి లభ్యత-నేటి పరిస్థితి వాతావరణ మార్పుల వల్ల వర్షాలు సకాలంలో కురవడం లేదు. కొన్నిసార్లు అతివృష్టి, మరికొన్ని సార్లు అనావృష్టి రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. బోరుబావుల లోతు ఏటేటా పెరుగుతోంది, విద్యుత్ ఖర్చు కూడా భారంగా మారుతోంది. వరి వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలను సంప్రదాయ పద్ధతిలో సాగుచేయడం వల్ల నీటి వృథా ఎక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టును లెక్కగట్టి వాడుకోవడం రైతుకు, రాబోయే తరాలకు అత్యవసరంగా మారింది. సాంకేతికత సాయంతో నీటి పొదుపు బిందు సేద్యం మొక్క వేరు దగ్గరకు నేరుగా, నెమ్మదిగా, అవసరమైనంత నీటిని మాత్రమే అందించే పద్ధతి ఇది. దీనివల్ల నీటి వృథా గణనీయంగా తగ్గి, 40-60 శాతం వరకు నీరు ఆదా అవుతుంది. కలుపు మొక్కల పెరుగుదల తగ్గుతుంది, ఎరువులను నీటితో పాటు నేరుగా అందించే వీలుండటం వల్ల (ఫర్టిగేషన్) ఎరువుల వాడకం కూడా సమర్థవంతంగా మారుతుంది. పండ్ల తోటలు, కూరగాయలు, పత్తి, చెరకు వంటి పంటలకు ఇది ఎంతో అనుకూలం. తుంపర సేద్యం చిరుజల్లుల్లా నీటిని పంట మీద చిమ్మే ఈ పద్ధతి, ముఖ్యంగా ఇసుక నేలలు, భూమి సరిసమానంగా లేని ప్రాంతాలకు అనుకూలం. వేరుశనగ, జొన్న, కూరగాయలు వంటి పంటలకు ఇది మంచి ఫలితాలనిస్తుంది. సాంప్రదాయ కాలువ పద్ధతితో పోలిస్తే 30 నుంచి 50 శాతం నీరు ఆదా అవుతుంది. మల్చింగ్ పద్ధతి పంట చుట్టూ ప్లాస్టిక్ లేదా వ్యవసాయ మొక్కల మొదళ్ల వ్యర్థాలతో (గడ్డి, చెత్త, పంట కుప్పలు) కప్పడాన్ని మల్చింగ్ అంటారు. దీనివల్ల నేలలో తేమ ఆవిరైపోకుండా ఎక్కువసేపు నిలిచి ఉంటుంది, కలుపు మొక్కలు తగ్గుతాయి, నేల ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. దీనిని బిందు సేద్యంతో కలిపి వాడితే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. వాన నీటి సంరక్షణ పొలం చుట్టూ కందకాలు (ఫామ్ పాండ్స్), వాలుకు అడ్డంగా గట్లు, చెక్ డ్యామ్లు నిర్మించుకుంటే వర్షపు నీటిని పొలంలోనే ఇంకించడం లేదా నిల్వ చేయడం సాధ్యమవుతుంది. దీనివల్ల భూగర్భ జలమట్టం పెరగడమే కాక, అవసరమైనప్పుడు ఆ నీటిని తిరిగి పంటకు వాడుకోవచ్చు. సాంకేతిక సాయంతో భూమి చదును : లేజర్ సాంకేతికతతో పొలాన్ని పూర్తిగా చదును చేయడం వల్ల నీరు అన్ని వైపులా సమానంగా పారుతుంది, ఎక్కడా నిలిచిపోదు, వృథా కాదు. దీనివల్ల 25 నుంచి 30 శాతం నీటి ఆదాతో పాటు, దుక్కి, విత్తనం, ఎరువుల వాడకంలో కూడా సమర్థత పెరుగుతుంది. నేల తేమ సెన్సార్లు, స్మార్ట్ ఇరిగేషన్ : సెన్సార్ల ద్వారా నేలలో ఎంత తేమ ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుని, అవసరమైనప్పుడు మాత్రమే నీరు పెట్టే విధానం ఇది. మొబైల్ యాప్స్ ద్వారా దూరం నుంచే మోటార్లను ఆన్ ఆఫ్ చేసుకునే సదుపాయం కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. దీనివల్ల అవసరానికి మించి నీరు పెట్టే అలవాటు తగ్గి, నీరు, విద్యుత్ రెండూ ఆదా అవుతాయి. వరి సాగులో ప్రత్యామ్నాయ పద్ధతులు ఆరుతడిగా నీరు పెట్టడం: వరి పొలంలో ఎప్పుడూ నీరు నిల్వ ఉంచడానికి బదులు" తడిపెట్టడం మరియు అరుదలకు వచ్చాక మరలా తడిపెట్టడం ఈ పద్ధతిలోని ప్రత్యేకత. శ్రీవరి సాగు : పలుచని నాట్లు మరియు తక్కువ నీటితో సేద్యం. ఈ రెండు పద్ధతుల ద్వారా వరి సాగులో 25 నుంచి 35% వరకు నీటిని ఆదా చేయవచ్చు దిగుబడి కూడా తగ్గకుండా చూసుకోవచ్చు తక్కువ నీటి వినియోగ పంటల ఎంపిక: నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి వంటి పంటలకు బదులు జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, వరిగలు వంటి చిరుధాన్యాలు, కంది, పెసర, మినుము వంటి పప్పుధాన్యాలు వేయడం మేలు. ఇవి తక్కువ నీటితోనే మంచి దిగుబడినిస్తాయి, నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. పంట అవసరాన్ని బట్టి మాత్రమే నీరు పెట్టాలి. నేల తేమను చూసి నిర్ణయం తీసుకోవాలి. వీలైనంత వరకు బిందు/ తుంపర సేద్యాన్ని అలవాటు చేసుకోవాలి, ప్రభుత్వ సబ్సిడీలను వినియోగించుకోవాలి. వర్షపు నీటిని ఇంకించే కందకాలు, ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. “ఇప్పుడు ఆదా చేసే ప్రతి నీటి బొట్టు- రేపటి పంటకు భరోసా." ఆధారం: పాడిపంటలు మాస పత్రిక , వ్యవసాయ పరిశోధనా స్థానం, పెరుమాళ్ళపల్లి, తిరుపతి